జలపాతం

జలపాతం
ఆకలి వేసి ఏడుస్తున్న, బిడ్డని చూసిన తల్లిని ఆపడం....రామ నామ జపం చేస్తున్న చోటుకి వెళ్ళకుండా హనుమయ్యని ఆపడం.....మనిషిలోని 'ఆ మనిషిని' తట్టిలేపుటకు జాలువారిన ఈ " జలపాతం " జోరును ఆపడం.....బహుశా ఎవరికీ సాధ్యం కాదు - జైకిషన్ శింగరాజు

Thursday, 4 August 2011

తెలుగు వీర లేవరా ?.....ఇప్పుడు కాక పోతే మరింకెప్పటికీ లేవలేవురా.



     
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట 

" Will you talk in telugu again ? "......  phat phat phat  ....
" అమ్మా......"  
" అదిగో మళ్లీ.....you are talking in telugu again....." .......... phat phat ....... 
"   అమ్మా ......"
" see again you are talking in telugu.....bloody idiot ".......phat phat phat .....
" will you talk in telugu again ? "
" no teacher ....no i will not talk in telugu again .....never in my life again ".......
" Thats better......now say ' I will not talk in telugu ' "
" I will not talk in telugu ...." 
" say once again .....  I will not talk in telugu ........"
" I will not talk in telugu ...." 
" Good....now write down ' I will not talk in telugu ....' for thousand times......"
" I will not talk in telugu ....I will not talk in telugu ... I will not talk in telugu ....I will not talk in telugu "
" Very Good......." 




కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట 
తెలుగువారు నవ జీవన నిర్మాతలని 
తెలుగుజాతి సకలావనికే జ్యోతి అని  
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట 


" నా పేరు సూడో ...... స్కూల్లో మీరు పడుతున్న అనేక ఇబ్బందులకి నేను శాశ్వత పరిష్కారం చూపగలను ..... నేను  మీ  స్కూల్ దిశలను మార్చి పారేయగలను ......."

" Wow .....అదెలా ......? " 
" Mr ప్రిన్సిపాల్.....మీరు ఇంత ట్రైనింగ్ ఇస్తున్నాఇంకా మీ స్కూల్ పిల్లలు తెలుగెందుకు మాట్లాడతారో తెలుసా......"
" ఎందుకూ ? ....."
" Because వాళ్ళవి తెలుగు పేర్లు కాబట్టి......" 
" W H Aaaa Ttttttttt  ? "  
" అవును ...... ఇంకా వాళ్ళు 'తెలుగు వారు ' అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు కాబట్టే  వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు "  
".......Oh my god ...........అదన్న మాట అసలు సంగతి " 
" YES ........ అందుకే నేను వాళ్ళందరికీ కొత్త పేర్లు ఇచ్చేస్తాను ....."
" కొత్త పేర్లా .......అంటే ......???? "
" ఏముంది కాల్ సెంటర్ లో employee కి పేరు మార్చేసినట్టుగా , పిల్లల పేర్లు మార్చిపారేస్తాను  ......వాళ్లకి సూడో పేర్లు ఇచ్చేస్తాను.... "  
" సూడో పేర్లా ? నాకేమి అర్ధం కావడంలా  ......"
" OK ..... చూడండీ...... ఫర్ example ఈ ప్రొగ్రెస్స్ రిపోర్ట్ మీద ఉన్న ఈ పిల్లాడి పేరు మధుసూదన్ ......ఇక మీద వీడి పేరు maddy   ......" 
" Oooooooo  ......."
" అల్లాగే .....సందీప్ ......వీడు ఇక నుంచి sandy   .....మాలికర్జున రావు ......ఇక మీద mike   ......సరస్వతి.....sarah   .... భ్రమరాంభ పేరు barbara  .....ఈ ఐదో తరగతి పిల్లాడు త్రిమూర్తి పేరు .....సింపుల్ గా tim  ......ఈ విధంగా స్కూల్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా మార్చిపారేస్తాను....మీ స్టాఫ్ తో సహా అందరి పేర్లు "     
 " అంటే మూకమ్మడిగా మతమార్పిళ్లు అన్నమాట........?? "
" ఛ ఛ .....కాదు .....Only name change....." 
" మరి parents గొడవ పెడెతేనో .....???  "
" VERY SIMPLE ......' మా స్కూలు మీ పిల్లల్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతుందంటే....వాళ్ళు తిన్నగా ఏ అమెరికానో .....కెనడానో వెళ్లి పోతారు. ఎలాగో అక్కడికి వెళ్ళాక వాళ్ళ పేర్లు మార్చబడతాయి కాబట్టి .....ఇప్పటి నుండే వాళ్ళ పేర్లు మార్చేసి ....వాళ్లకి అలవాటు చేస్తున్నాము ' అంటే సరిపోతుంది "

" O .....Wow ........what an Idea Mr సూడో ....మీరు వెంటనే మీ పని ప్రారంభించండి....Please  give us your  quotation .......ఒరేయ్ బ్రహ్మయ్యా.....   వీరిని administration block కి తీసుకెళ్ళు......అలాగే ముందు వీడి పేరు మార్చండి   సూడో "

" బ్రహ్మయ్య .....ఇక నుండి Abraham  "

" Abraham ..... ఓహో సూపర్ అయ్యగారు .....అట్టానే మా అయ్యగారి పేరు కూడా మార్చేయ్యండి "

" Mr పండరినాథ్ D .......ఈ క్షణం నుండి మీ పేరు pan - D .....  "

" ఒద్దులెండి....మరీ పందిలా ఉంది ......నాది తరువాత చూద్దాంగాని....ముందు పిల్లల పేర్లు మార్చండి..... All the Best "  



కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట 


" Sir ....ఎవరో ఒక parent రుస రుస లాడుతూ ఇటే వస్తోందండీ....."   
" రాని నేను మాట్లాడుతాను .....ఇదిగో ఆ స్టాఫ్ రూంలో ఉన్న అమ్మలక్కలందరికి ఇంగ్లీష్ లో మాట్లాడుకో మనిచెప్పి నువ్వుపో " 

"  Good afternoon madam.... please welcome to " Gudibanda International Public School .....How can i help you madam "  

" ' ఊ....ఊ....ఈ ఎదవ కటింగులుకి తక్కువేంలేదు '...చూడండీ వచ్చే సంవత్సరం మా పిల్లాడ్నిఈ స్కూల్ మానిపించేస్తున్నాం "

" ....అయ్యో అయ్యో అదేమిటండి..... ఎందుకూ ???? "

" ......మా అబ్బాయి తెలుగు మాట్లాడుతున్నాడు " 

" అయ్యో అయ్యో అయ్యో .....ఎంత పొరపాటు జరిగింది madam ....ఏకంగా తెలుగు మాట్లాడేస్తున్నాడా  ? ....అయ్యో అయ్యో "

"..... మా వారు తెగ చిరాకు పడిపోతున్నారు....ఆయనకి పిచ్చెక్కుతోంది....."

" ఏదో పొరపాటు జరిగింది madam ......మీరు ఏమీ ఆవేశపడకండి......ముందు మీరు ఈ thums up తీసుకోండి "

" మొన్నీమధ్య మా వదినాగారు, వాళ్ళ పిల్లలు వచ్చి వెళ్ళారు ......
ఆ పిల్లలు ఎంత ముద్దుగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో. వాడు దొడ్లోంచి ' అమ్మా నా పని పూర్తయింది ' అనడానికి కూడా ఎంచక్కా ఇంగ్లీష్ లోనే అంటాడు.......
మా అత్తగారిని వాళ్ళు grany grany   అంటూ పిలుస్తుంటే....ఆవిడెంత ముచ్చట పడ్డారో .....  ఇంతలో మా వెదవేమో ' బామ్మా బామ్మా ' అని పిలిచచ్చేవాడు.....పాపం ఆవిడకి తల తీసేసినట్టు అయ్యేదనుకోండి ......
వాళ్ళకి తెలుగు బొత్తిగా రాదండి బాబూ......వాళ్ళ మోహన అమ్మా నా బూతులు తిట్టినా వాళ్ళకేమి అర్ధంకాదు.....అంతగా తెలుగు అస్సలు రానివ్వని స్కూల్లో చదువుతున్నారు.......ఇక్కడ అంతకంటే ఎక్కువ ఫీజులు తగలేస్తున్నామాకు మటుకూ ఆ అదృష్టం లేదు "    

" పొరపాటు అయిపోయింది madam   ...సారీ madam ......ఈ సారికి వదిలేయండి madam  ....ఇంకొక్క అవకాశం ఇచ్చిచూడండి.....next month నుంచి మీవాడు ఇంగ్లీష్ ఎలా మాట్లడుతాడో చూసుకోండి.....ప్రతీదీ ఇంగ్లీష్ లోనే ఎలా మాట్లాడుతాడంటే .....వాడికి చిరాకు వచ్చినప్పుడు ' అబ్బా' అనకుండా, ఇక నుండి daddy అంటాడు సరేనా.....Its my promise ......మీరు నిశ్చంతగా వెళ్ళండి."                   




కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట 

పరిస్థితులు ఇలాగే కొనసాగితే .... శ్రీ శ్రీరంగం శ్రీనివాస్ రావు గారు....  
బహుశా  మీ ' తెలుగు వీరుడు ' ఒక తెలుగువాడిగా ఇక మరెప్పటికీ లేవలేకపోవచ్చు. 



మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి, ఈ తెలుగు నాట, సంకరజాతి గుణాలు బయటపడక ముందే, 
మీ ' మహా ప్రస్థానాన్ని' ముగుంచుకుని, సరిగ్గా 28 సంవత్సరాల క్రితమే సెలవు తీసుకున్నారు. 
ఒక తెలుగువాడిగా, ఒక తెలుగు భాషాభిమానిగా, మారుతున్న ఈ ' Italian of the East ' తీరుతెన్నులు గమనిస్తున్నవాడిగా, భాదపడడం మినహా మరేమీ చెయ్యాలో కూడా తోచనివాడిగా.... 
.......  మీ వర్ధంతి సందర్భంగా ఇదే నా శ్రద్దాంజలి.   

-----------------------------------------------------    

మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము.....అదే స్వర్గము.....
ఆశలు తీరని ఆవేశములో.....ఆశయాలలో.....ఆవేదనలో.....చీకటి మూసిన ఏకాంతములో....తోడొకరుండిన అదే భాగ్యము.....అదే స్వర్గము......

మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము.....అదే స్వర్గము.....
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు.....నీకోసమే కన్నీరు నించుటకు .....నేనున్నానని నిండుగా పలికే ....తోడొకరుండిన అదే భాగ్యము.....అదే స్వర్గము......
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము.....అదే స్వర్గము.....             




* కలసి పాడుదాం - బలిపీతం - 1975  *మనసున మనసై - డా!! చక్రవర్తి - 1964   

జై కిషన్ శింగరాజు 

Friday, 29 July 2011

"వందేమాతరం"


గాలి వీస్తోంది....నీరు ప్రవహిస్తోంది......అగ్ని జ్వలిస్తోంది......భూమి భరిస్తోంది.......చూడగలిగితే సూన్యం యావత్ బ్రహ్మాండాన్ని  చూపిస్తోంది.
ఎవరు భేష్ అన్నా......అనకపోయినా.......భుజం తట్టినా.....వెక్కిరించినా.....పొగిడినా......దూషించినా.....
ప్రార్ధించినా....విమర్శించినా .....కనీసం పట్టించుకోక పోయినా........
అన్నింటికీ అతీతంగా.......తరతరాలుగా జీవకోటి అవసరాలను తీరిస్తూ.......ఆ భగవంతుని ప్రతిరూపాలుగా విరాజిల్లుతున్నాయి, ఆ దివ్యమైన పంచభూతాలు.   

ఆ పంచ భూతాల కోవకు చెందిన మనుష్యులూ ఉన్నారూ. 
 ఎందఱో మహానుభావులు తమ జీవితాలను ఈ జగద్దోదారణ కార్యక్రమములో భాగంగా త్యజించారు.
తాము నాటుతున్న విత్తనాలు రేపు మహావృక్షాలయిన రోజున, వాటి నీడలో పడుకునే వారు తమను గుర్తిస్తారో లేదో నన్న సంశయం గనుక వారిలో ఉండిఉంటే, బహుశా మనం పుట్టేనాటికే ఈ జగత్తంతయు ఇసుక ఎడారులుగా మారి, జీవించడానికి ఏ మాత్రమూ అవకాశం లేక మరణించియుండెడి వారమేమో.
అటువంటి ఉద్ధారకులలో ఒకరు, ఈ దేశానికీ, జాతికీ ఒక గుర్తింపుతెచ్చి, తానెవరో కూడా ఈ దేశం గుర్తించలేని స్థితిలో, కటిక దారిద్ర్యంలో కన్నుమూసారు.

-------------------------------------------------

2001 వ సంవత్సరం...  ఏదో పని మీద నేను డిల్లీ వెళ్లాను. 
India Gate వద్ద ఓ సర్దార్జి కొంతమంది విదేశీ యాత్రికులకి గైడు గా వ్యవహరిస్తున్నాడు.
జాతీయ పతాక విశిష్టత గూర్చి తనకు తెలిసినదేదో వారికి చెప్పేస్తున్నాడు. 
ఇంతలో ఒక ఆవిడ అతన్ని " ఈ పతాకాన్ని ఎవరు తయారు చేసారు ? " అని అడిగింది. 
ఆ సర్దార్జీ ఏమాత్రం తడుముకోకుండా " ఇంకెవరు ...... మా గాంధీజీ యే తయారుచేసుకున్నారు " అని చెప్పాడు. 
నాకు ఒళ్లుమండింది..... వెంటనే వాడిని లాక్కెళ్ళి ఆ INDIA GATE పై నుండి తోసేయాలనిపించింది.
కాస్త శాంతంగా ఆలోచిస్తే..... 
ఆ మహానుభావుడు, గుర్తింపు కోసం ప్రాకుళ్ళాడని వ్యక్తిత్వం కలిగిఉండడం......ఈ సర్దార్జి తప్పేలా అవుతుంది అనిపించింది.   
            
INDIAN FLAG

1899 వ సంవత్సరం.సాయంత్రం 6 గం!! Durban నగర సివారులలోని బ్రిటిష్ సైనిక శిబిరాలు. 
Boer యుద్ధం జరుగుతున్న రోజులు.
సౌత్ఆఫ్రికా నల్ల జాతియులుకు చికిత్స నిమిత్తం, స్వచ్చందంగా సేవలు అందిస్తున్న Indian Ambulance corps , warrant officer , 30 సంవత్సరాల వయసుగల Mohandas, ఆ బ్రిటిష్ శిబిరాలలోకి తొంగిచూస్తూ ఎవరికోసమో వెతుకుతున్నారు. 
ఒక శిబిరం ముందు ఆగి " Mr Venkaiah ? " అని ఓ బ్రిటిష్ - ఇండియా ఆయుదాల accounts రాసే సైనికుడి వైపు చూస్తూ  ప్రస్నార్ధకంగా నిలుచున్నారు. 
" Mr Mohandas ......very happy to meet you "....అని పొడుగాటి ఆ కుర్రవాడు బయటకొచ్చి మోహన్ దాస్ ని అభిమానంగా కౌగిలించుకున్నాడు. " I read the articles you write on behalf of ' Natal Indian Congress ' on racism....i was the one who wrote those letters to you.....namaste ....I am pingali venkaiah ..... from bezawada ...... andhra " . 
తనని ప్రోత్సహిస్తూ ఉత్తరాలు రాసే అభిమాని, సౌత్ ఆఫ్రికా వచ్చాడని, తను పని చేస్తున్న శిబిరంలోనే ఉన్నాడని తెలుసుకుని, వెతుకుంటూ వచ్చాడు, రాబోయే కాలాన్ని నడిపించబోయే బాపూజీ ' శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ'.  

MK Gandhi., Warrant Officer., Indian Ambulance Corps.
-----------------------------------------

1916 అక్టోబర్......కాకినాడ లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ మహాసభ.
" నమస్తే భాపు "......
" నమస్తే వెంకయ్యా జీ ....ఇందాక మీరు ఏదో చెప్పబోతున్నారు....
ఆ హడావుడిలో నేను వినలేకపోయాను.....ఇప్పుడు చెప్పరూ  "
"ఈ స్వరాజ్య ఉద్యమంలో భాగంగా దేశం మొత్తాన్ని ఒక్క తాటిపైకి తేవాలంటే మనకో చిహ్నం కావాలి.....
ఆ చిహ్నం మన ఆత్మగౌరవాన్ని, సమైక్యతని, సాంప్రదాయాన్ని......ఒక్క మాటలో చెప్పాలంటే మన జాతిని ప్రతిబింబించాలి....
అతి సామాన్యుడు సైతం ఆ చిహ్నాన్ని చూసి ఉత్తేజితుడై ఉద్యమదిశగా కదం తొక్కాలి....
ఆ చిహ్నమే మన ఉద్యమ జెండా.....అజెండా కావాలి "
" భేష్.....చక్కటి ఆలోచన.....ఇంకెందుకు ఆలస్యం....... ముందు ఆ పని మీద ఉండండి
కొన్ని నమూనాలు తయారుచేసి మహా సభలకు పంపిస్తే....అందరి ఆమోదంతో ఏదో ఒక్క దానిని ఖరారు చేద్దాం "

Designs made by Pingali Venkaiah before making the final one



1921 మార్చ్ 31 ......బెజవాడ....PWD గ్రౌండ్స్.
నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్...... 
  లక్షల సంఖ్యలో జన సమూహం.....
వేదిక పై మహాత్మాగాంధీ, కస్తుర్బా, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్, సరోజినీ నాయుడు, జవహరలాల్ నెహ్రు, మోతిలాల్ నెహ్రు, గొల్ల నారాయణరావు, దాసు మధు సూధనరావు మొదలగు ప్రముఖ నేతలు........
లక్షల గళాల 'వందేమాతరం' అన్న నినాదాల మధ్య గాంధీగారి ప్రసంగం.......
ఆయన మాట్లాడుతున్న ప్రతీ మాటని ఎంతో శ్రద్దగా వింటూ మధ్య మధ్యలో ఉత్సాహభరితులయి చప్పట్లు చరుస్తున్నప్రజవాహిని......ఇంతలో ఒక్కసారిగా గాంధీగారు తన ప్రసంగాన్నిఆపి, 
కర్రకి కట్టిన ఒక కొత్త జండాని భుజాన పెట్టుకుని, జనం మధ్యలోనుండి నడుస్తూ వస్తున్న వ్యక్తిని చూస్తున్నారు......
 ఆ వ్యక్తీ సరాసరి వేదిక పైకొచ్చి, ఆ జండాని, లేచి నిలబడిన గాంధీగారి చేతికిచ్చి ఆయన ముందు మోకరిల్లాడు......
కాషాయం, తెలుపూ, ఆకుపచ్చ రంగులు, వాటి మధ్యలో చరకా కలిగిన ఆ జండాని, మహాత్ముడు రెండు చేతులా పట్టుకుని ఆత్మీయంగా చూస్తూ, తన నుదిటిని ఆన్చి అభివాదం చేసాడు. 
జెండా చేత బూని ప్రజల వైపుకు తిరిగి....." నేటి నుండి ఈ ఉద్యామాన్ని......మావంటి నాయకులని....
భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు తలమానికంగా ఈ దేశాన్నీ ముందుకు నడిపే మహాశక్తే ఈ జెండా....."
అంటూ జెండా ఊపారు భాపుజీ....'వందేమాతరం' నినాదాలతో ఒక్కసారిగా మార్మోగిపోయింది యావత్తు బెజావాడ.                             

Finally the Tri color arrived from the heart of Mr. P.Venkaiah


             మౌసులిపట్నం (మచిలీపట్టణం) దగ్గరగల భట్లపెనుమర్రులో, నియోగి - బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి.... 
కొలొంబోలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, భారత స్వాతంత్ర ఉద్యమం పురుడు పోసుకుంటున్న సమయంలో, బ్రిటిష్ ఉద్యోగి హోదాలో సౌత్ఆఫ్రికా వెళ్లి ,  భవిష్యత్తు జాతిపిత శ్రీ M .K .గాంధీ తో చేతులు కలిపి , దాదాపు అర శతాబ్దం తన జాతి కొరకు చేసిన పోరులో సర్వాన్నీ త్యజించిన ఆ మహనీయుడు, ఈ దేశ మానాభిమాన సూచికగా విలసిల్లుతున్న త్రివర్ణ పతాకాన్ని తయారు చేసిన భారత స్వాతంత్ర సమరయోధుడు ' శ్రీ పింగళి వెంకయ్య పంతులు గారు '.

Sri P Venkaiah during 1921 (approx)


భోగోళిక శాస్త్రంలో అపార జ్ఞానసంపత్తి కలిగిన శ్రీ వెంకయ్య గారు, వజ్రాల గనులు, ప్రత్తి ఉత్పత్తి - పెరుగుదల మొదలగు అనేక అంశాలపై అనేక సంవత్సరాల అధ్యయనం చేసి బ్రిటిష్ శాస్త్రజ్ఞులను సైతం అబ్బురపరిచే అనేక విషయాలు కనుగొన్నారు. అభిమానంగా ఆయనను డైమండ్ వెంకయ్య, కాటన్ వెంకయ్య అని పిలుచుకునేవారట.     
కంబోడియా ప్రత్తి ఆయన వెలికి తీసిన అద్భుతాలలో ఒకటి.        
ప్రజ్ఞావంతుడయిన శ్రీ వెంకయ్యగారు ఒక రచయిత, కవి , బహుభాషాకోవిదుడుగూడాను.
    హిందీ,ఇంగ్లీష్లతో పాటు ఉర్దూ, జపనీస్ భాషలలో కూడా అనర్గళంగా మాట్లాడేవారట.     

అగ్రహారాన్ని, పొలాలని, తోటల్ని, గడించిన సమస్తాన్ని స్వరాజ్యపోరుకై హారతి కర్పూరంచేసిన ఆ మహానుభావుడు......
స్వంతంత్ర భారతావనిలో తన ఆఖరి పదిసంవత్సరాల జీవితాన్ని అత్యంత దుర్భరమయిన పరిస్తితులలో గడిపారు.

కీ. శే !! శ్రీ పింగళి వెంకయ్య గారు 

       
87 సంవత్సరాల వయసులో....విజయవాడలో ఏదో మారుమూల, ఓ పూరిపాకలో.....కనీసం కడుపునిండా తినడానికి కూడా నోచుకోని స్థితిలో వారు కాలం చేయడం.... మన జాతికి , మన నాయకులకి, ఈ ప్రజలకీ, ఈ మహనీయుల పట్ల ఎంతటి గౌరవాభిమానాలున్నాయో చెప్పకనే చెబుతోంది.   

------------------------------------------------------------------
అయ్యా ! శ్రీ పింగళి వెంకయ్యగారు ......మీవంటి వారిని అంతగా క్షోభ పెట్టినందుకు తగిలిన శాపమో పాపమో .....
65 వసంతాల నిండు ముత్తైదువు అయిన ఈ భరతమాత, పాపం నేటికీ తప్పటడుగులు వేస్తూ, ఇంకనూ నడక నేర్చుకునే స్థితి లోనే ఉండిపోయింది. మదమెక్కిన పాలకులపై , పదవి వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయిన నాయకులపై, అవినీతి మయమయిన ఈ దేశ రాజకీయవర్గాలపై , త్వరలో ఈ దేశ ప్రజ తిరగబడి చేయబోయే మరో స్వరాజ్యపోరాటంలో మీవంటి వారి విజయగాధాలే మాకు స్ఫూర్తి ప్రదాతలు అని ప్రగాడంగా విశ్వసిస్తూ.......
మరొక్క సారి గట్టిగా ......

"వందేమాతరం"         



వారి జ్ఞాపకార్ధం పోస్టల్ డిపార్టుమెంటు వారి గౌరవం 


ఆఖరిగా ఒక్క మాట : 1963లో శ్రీ వెంకయ్య గారు చనిపోయాక వారి దిండు కింద దొరికిన కాగితాలలో ఒక కాగితం పై రాసున్న ఈ ఇంగ్లీషు పద్యం.....అంత దారిద్ర్యంలోనూ ఇసుమంతయినా తగ్గని వారి దేశభక్తిని చాటి చెబుతుంది.                  
          

The tricolour ensign of our rich domain
Shall fly aloft and there for ever and ever remain
To remind the world of our famed Maurian Asoka the great
Of vast empire, peaceful and brotherhood state.
Sacrificial saffron will for noble courage stand,
Peaceful white is the truthful central band,
Parrot green will rich chivalry and faith denote.
                                     
ఓ మహనీయుడా.....నీకు జోహార్  

జై కిన్ శింగరాజు


Wednesday, 20 July 2011

నడక నేర్పిన నడవడి....


అది 1967 డిసెంబర్ 10వ తారీఖు....ఉదయం 10 గం!!.....చెన్నైలోని మాంబ్లం - శివ విష్ణు దేవాలయ ప్రాంగణం. 
ఓ మహానుభావుడు, ఆ దేవాలయం బయట వేచియున్న వేలాది మంది హర్షద్వానాల మధ్య, రెండు చేతులూ జోడించి, ఎంతో సౌమ్యంగా " பிடி அரிசி திட்டம்  (పిడి అరిసి తిట్టం) (' పిడికెడు బియ్యం పధకం ') " అని ఉద్గాటించాడు.
మీరు రోజూ ఒక్క పిడికెడు బియ్యం తీసి పక్కన పెట్టగలిగితే.....ఈ దేశంలో ఏ ఒక్కరు ఆకలితో అలమటించరు......
మీ ఇంట తరతరాలూ కడుపునిండా భోంచేయగలరు " అంటూ నడిచే దేవుడుగా పిలవబడ్డ 68 వ కంచి కామ కోటి పీఠాదిపతి,  పరమాచార్య, మహాస్వామి, మహాపెరియవాళ్ శ్రీ శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వామివారు, యావత్ భారతదేశానికి పిలుపునిచ్చారు. 

Paramacharya
                                                      
 ==============================================                                    

ఖాళీ రహదారి .....పెచ్చులూడిన రాళ్ళదారి....
' సీతా సీతా ' అని దిక్కులు పెక్కుటిల్లేలా అరుస్తూ, ఆ సీతారాముడు నడిచినది ఇదే దారి.....
గోవుల్నిమేతకు వదిలి,ఆటపాటలతో ఆ గోపబాలురకి తత్వాన్ని భోదించినదిక్కడే ఆ కృష్ణ మురారి....        
కాలడి నుండి కాలినడకన అద్వైతవేదాంత పరిమళాలను వెదజల్లిన శంకరభగవత్పాదులు చూపినదిదే  దారి....

నడిచి నడిచీ మొద్దుబారిన పాదాలకి పూలయితేనే.... ముళ్ళయితేనే... నడక సాగించారా బాటసారి....
నడిచి సాధించరా 'నువ్వేవ్వరివో నన్న' సత్యాన్ని మలుపోకోమారి.....  
అనుభవించరా ఉబికివచ్చే ఆ జ్ఞానామృతాన్ని ప్రతీసారి
 
అరణ్యాలు, కీకారణ్యాలు, చిట్టడవులు,జలపాతాలు, చెరువులూ, కుంటలూ, ప్రకృతి రమణీయ  సోయగాలు, అక్కడక్కడ తొంగిచూసే పచ్చని పంటలు.....అప్పుడప్పుడప్పుడు పలకరించి వెళుతున్నరోడ్డు వెంబడి గ్రామాలు ....ఇళ్ళ లోంచి పరుగున పరుగున చూడ వచ్చిన జనాలు.....వారి సాష్టాంగ నమస్కారాలు......2003 వ సంవత్సరం మండలం చలి గాలులు ......1005 కిలోమీటర్లు....30 రోజులు... బుద్ధుని వెంట నడిచిన భిక్షువులువలె గురు స్వామి వెంట నడుస్తున్న 38 మంది మాల ధరించిన స్వాములు.        

సికింద్రాబాద్ గణపతి దేవాలయం నుండి మొదలయిన ఆ నడక, పదునెట్టాంబడినెక్కి ఆ యోగముర్తిని దర్శించేదాకా దిగ్విజయంగా సాగింది.అడుగుకొక అక్షరంగా ఆ రమణుడి భక్తి వేదాంతాన్నినూరిపోసింది.

కొండాకోనల మధ్య, అడ్డదారుల గుండా, పొలంగట్ల మీదుగా, పిల్ల కాలువల వారుగా, జలపాతానికి - కొండకి మధ్యగల దారిలో, ఎలా వీలయితే అలా, ఈ దారులగుండా ఎన్నో సారులు ప్రయాణం చేసిన ఆ గురుపుంగవుని వెంట, నెత్తిన ఇరుముడి, భుజాన వంట సామగ్రి, వీపున వ్రేల్లాడుతున్న బ్యాగులో, నల్లని లుంగీ, ఓ దుప్పటి, " స్వామియే శరణం అయ్యప్ప " అని ఆ నిశబ్దాన్ని చేదిస్తూ, చేస్తున్న శరణఘోష ప్రియుని నామావళి. 


ప్రతిరోజూ ఉదయం 4 గం!! నిద్రలేచి, దగ్గరలోని నీటి వసతి వద్ద స్నానాదులు, పూజా పునఃస్కారాలు ముగించుకుని 6 గం!!లకు మొదలయ్యే నడక, 11 గం!! ప్రాంతంలో ఏదయినా నీటి సదుపాయంగల ప్రాంతంలో ఆగేసరికి, కనీసం 20 కిలోమీటర్లు పూర్తిచేయబడుతుంది. వంట - వార్పూ - బిక్ష , ముగించుకుని 2 గం!! లకు మళ్ళా మొదలయ్యే నడక 15 కిలోమీటర్ల తరువాత ఉండే ఏదేని వూరు, లేక ఓ చిట్టడవి,  ఆ ఊరిలోని దేవాలయం లేక ఆ చిట్టడవి లోని చెట్లే ఆ రాత్రికి మజిలి. వేసే ప్రతీ అడుగూ, వచ్చే ప్రతి మలుపూ.... ముందుకు నడిపిస్తున్న ఆ గురుస్వామిదే భారం.    
                   
అయిదేళ్ళ క్రితం కాలం చేసిన ఆ మహానుభావుడు, సెంథిల్ ఆర్ముగన్ అయ్యర్.....ఆరడుగుల పొడవుండే, ఆయన ఉక్కులాంటి శరీరం .....వెండి తీగలవంటి నెరసిన పెద్ద గెడ్డం......నిప్పు కనికెళ్ళాoటి కళ్ళు .......71 సంవత్సరాల వయసు (ఆనాటికి).....నుదిటిపై నామాలు.....ముఖం పై నిత్యం ఆనందం........తాతలనాడే తంజావూరు నుండి వరంగల్ వచ్చి స్థిరపడ్డ ఓ తమిళ సాంప్రదాయ కుటుంబం......50వ సారి అయ్యప్ప స్వామిని దర్శించుకోబోతున్నఆ మహానుభావుడే ' గురుస్వామి ఆర్ముగం '.  
  
           
---------------------------------------------

అలా సాగుతున్న ఆ ప్రయాణంలోఒక నాడు సాయంత్రం, కర్ణాటక రాష్ట్రంలోని 'కొడియల' అనే మారుమూల గ్రామం చేరుకున్నాము. ఆ గ్రామంలోని ఓ పాత సిద్దేశ్వరస్వామి దేవాలయంలో బస ఏర్పరచుకుని, ఆ గుడిని శుభ్రపరచి, పూజా పునఃస్కారాలు ముగించుకుంటుండగా, గురుస్వామి గుమగుమలాడే వేరుశనగ ఉప్మా వండి సిద్ధం చేసారు. 

ఆనవాయితీ ప్రకారం ఆ ఊరి వారిని పిలిచి దైవనామ సంకీర్తన, భజన మొదలగు కార్యక్రమాల అనంతరం,ఆ దైవానికి నైవేద్యం సమర్పించాక, మా కోసం ఒండుకున్న ఆ ఫలహారాన్ని ముందుగా వచ్చినవారికి పెట్టి, మిగతాది మేము తిన్నాము.

ఆ రోజూ అనుకోకుండా ఎక్కువమంది రావడం, అదీకాక వారిలో చాలామంది ఒకటికి నాలుగైదుసార్లు అడిగి మరీ తినడంతో, మాకు ఫలహారం సరిపడా మిగలలేదు. దాంతో బాగా ఆకలిగానున్న కొంతమంది స్వాములు కాసింత చిరాకు పడుతూ, దాన్ని గురుస్వామి ముందు ప్రదర్శించే ధైర్యం లేక మిన్నకుండిపోయారు.                       

ఇదంతా గమనించిన గురుస్వామి " పిడికెడు బియ్యం మీవి కావనుకుంటే ఈ జగత్తు కడుపునింపగలరు ......ఏదో ఒక నాడు ఈ జగత్తంతా తలాపిడికెడు మీకు వెనెక్కి ఇస్తుంది చూడండీ ......ఆనాడు మీ తరతరాలు కూర్చునితిన్నా కరగక నిలిచిపోగలదు.......మనం ఏది ఇచ్చినా, అది అంతయి - ఇంతై - ఇంతింతై మళ్ళా మనని వచ్చి చేరుతుందన్న విషయం మరవకండి ......అన్నదాన ప్రభువే - శరణం అయ్యప్ప " అని ఆ స్వాములను ఉద్దేశించి చెబుతూ, తమలో తాము నవ్వుకుంటూ విశ్రమించారు.

మరుసటిరోజు ఎదావిదిగా దగ్గరలోని చెరువులో స్నానాదులు, పూజాది కార్యక్రమాలు ముగించుకుని శరణఘోష చేస్తూ, సామాను తీసుకోవడానికి తిరిగి వస్తుంటే, మా జీవితాలను మలుపు తిప్పగల ఓ గొప్ప సంఘటన జరిగింది.

ఎప్పుడో గాని శుభ్రత ఎరుగని ఆ దేవాలయం.... మేము చెరువు నుండి తిరిగివచ్చే సరికి, చక్కగా నీళ్ళతో కడగబడి, మామిడాకుల తోరణాలు కట్టబడి, గుడి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయబడి....ఆ సిద్దేస్వరుణ్ని ఎంతో అందంగా అలంకరింపబడి..... కమనీయంగా, ఉన్నపళంగా ఓ పండుగ వాతావరణం నెలకొల్పబడియుంది.
ఈ రోజూ ఏదయినా పండుగా ? అని అనుకుంటూ వచ్చేంతలో.... 

ఆ ఊరి పెద్దా, తక్కిన జనసమూహం అంతా వచ్చి చేరారు.   
జంతికలు, మురుకులు,లడ్లు, చేగోడీలు,కారప్పూసా, వేయించిన మరమరాలు,శనగలు, బెల్లం వేరుశనగ ఉండలు ఇలా ఓ డజను వరకు పిండివంటలు ఒకరితరువాత ఒకరుగా ఆ సిద్దేశ్వర స్వామికి సమర్పించారు.  
ఇంతలో తెలిసిన విషయం ఏమిటంటే ........
క్రితం రాత్రి ఆ ఊరిలోని వారందరూ బృందాలుగా విడిపోయి, తలా ఒక చోట చేరి ఆ పిండివంటలన్నింటిని సిద్దపరిచారటా........
ఈరోజు ఏమిటీ ప్రత్యేకత ? అని అడగ్గా ......                

ఆ ఊరి పెద్ద, వినయంగా గురుస్వామి పాదాలకు నమస్కరించి " అయ్యా, మీరు దేవతల్లా వచ్చి మా చేత భజన చేయించి మరీ కడుపునిండా ఫలహారం పెట్టి పంపించారు. అందుకు ప్రతిగా మా వూరి వారంతా, వారికి తోచినది వండి మీకు సమర్పించదలచారు  .....కాదనక స్వీకరించండి " అని ప్రాదేయపడ్డాడు." అంతే కాదు...కొన్ని తగాదాల కారణంగా దూరమయిన మా ఊరిలోని కొంతమందిమి, చాలా కాలం తరువాత, మీ పుణ్యమా అని, ఒక్క చోట చేరి కలిసి భోజనం చేసాం.....ఆ దైవసాక్షిగా మళ్ళా మేమంతా కలిసాం.....ఆ ఆనందంతోనే ఇవ్వన్ని చేసితెచ్చాం.....దయచేసి కాదనకండి " అని ఆ పల్లె ప్రజలు బ్రతిమలాడారు. వారి వాత్సల్యాన్ని కాదనలేక గురుస్వామి నిశ్చేష్టులయి నిలబడిపోయారు.

ప్రతిఒక్కరి కాళ్ళు కడిగి, వారు నెత్తిన చల్లుకుని, వారి స్వహస్తాలతో ఆ తినుబండారాలను మాకు తిపిస్తుంటే.....
మా చెమర్చిన కళ్ళు , 'పిడి అరిసి తిట్టం' అన్న ఆ పరమాచార్యుని ప్రతిరూపంగా, మనం ఏది ఇచ్చినా అది అంతయి - ఇంతై - ఇంతింతై మళ్ళా మనని వచ్చి చేరుతుందన్నమా గురుస్వామిని చూడనివ్వకపోయినా.....
ఆయన వైరాగ్యపు చిరుమందహాసాన్నిమాత్రం మదిలో స్పష్టంగా చూడగలిగాము.

ఆ పిండివంటల్ని మూటలకెత్తి మరీ అప్పచెప్పారు ఆ ఊరువారు. 
కడుపునిండలేదని, రాత్రి విసుగుకున్న స్వాముల వైపు చూస్తూ, ఆ మూటలనెత్తుకోమని సైగచేసారు గురువుగారు.                                                        
దేనికోసమయితే మనము ఎక్కువగా ఆరాట పడతామో , అది ఈ విధంగా వచ్చి చేరుతుందని తెలుసుకున్న ఆ స్వాములు, దిగ్భ్రాంతి చెంది మరీ ఆ బరువయిన మూటలని భుజాలకెత్తుకున్నారు.

 ఎంత తిన్నా బరువుతగ్గని ఆ మూటల్ని పాపం ఆ స్వాములు రెండు రోజులు పాటు మోసారు. 
ఆఖరికి విసుగెత్తి ఓ సాయంత్రం, మేము బస చేస్తున్న ఊరిలో అందరికీ పనిమాలా వెళ్లి మరీ పంచొచ్చారు.

ఆ మరుసటి ఉదయం మేము బయలుదేరుతున్న సమయంలో, ఓ పెద్ద రైతు తన మనుష్యులతో వచ్చి, ఆ స్వాములని మాలో వెతికిమరీ పట్టుకుని " అయ్యా స్వాముల్లారా ....మీ తినుభండారాలను, ఇల్లు ఇల్లు తిరుగుతూ మా ఊరి వారికి మీరు పంచడం నేను స్వయంగా చూసాను. మీ పెద్ద మనసుకు నా నమస్కారాలు " అంటూ వారి పాదాలపై సాష్టాంగపడి " పాపం దారిలో మీకు ఆకలేస్తే తినడానికి ఏమయినా కావాలికదా ....అందుకే నాకు తోచినవేవో తెచ్చాను.....దయచేసి వీటిని స్వీకరించండి " అని ఉడకపెట్టిన శనక్కాయలు, బటానీలు , వేయించినా శనగలు, ఇంకా ఏవో ఓ నాలుగు పెద్ద బస్తాలను వారి పాదాల వద్ద ఉంచి, వీరు ఏదో అనే లోపే వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆ పెద్దరైతు, అతని మనుష్యులూ.  

"ఈ బస్తాల కన్నా ఇంతకుముందున్న మూటలే నయం కదా " అనుకుని, బిక్కమోకాలు వేసుకున్న ఆ స్వాములను చూసి, నవ్వాగాక ఒక్క సారిగా, గురుస్వామి తోపాటు అందరూ పగలబడి నవ్వారు. 

" ఇప్పుడు అర్ధమయిందా స్వాములు.....ఆరాటపడితే.....ఏమీ చేసుకోవాలో కూడా తెలియనంతగా వచ్చి పడుతుంది....ఆదరిస్తే ......ఏమీ చూసుకోకపోయినా, ఆ ప్రవాహమే ముందుక తీసుకెళ్ళుతుంది.......ఆరాటం బరువు......ఆదరణ సులువు "               

అని చెప్పి ఆ బస్తాలను సంచీలలోకి సర్ది, ఆ బరువును అందరికీ సమానంగా పంచారు గురుస్వామి ఆర్ముగం.
    


   ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే శరణం అయ్యప్ప   
జ్ఞానవైరాగ్య దాయకనే శరణం అయ్యప్ప  
అనాధరక్షకనే శరణం అయ్యప్ప 
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప 
ఆపద్భాందవనే శరణం అయ్యప్ప   
ఆర్యంగావు అయ్యవనే శరణం అయ్యప్ప  
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 


            జై కిషన్ శింగరాజు  

Monday, 11 July 2011

ఓం శ్రీ గురుభ్యో నమః


భగవంతుడు అవతారమూర్తి అయి రాక్షస సంహారం చేసి, సృష్టి ప్రక్షాళన చేస్తాడు......గురువు ఆ రాక్షసుడిలోని 
రాక్షసత్వాన్నితొలగించి మనుషులను తయారుచేస్తాడు.
భగవంతుడు కల్పవృక్షం వంటి వాడు - ఎది అడిగినా ఇస్తాడు.......గురువు ఖామధేనువు - ఏది ఇవ్వాలో తెలుసుకుని మరీ ఇస్తాడు.
భగవంతుడు తండ్రి అయి కాచుకొస్తాడు........గురువు తల్లీ అయి కడుపున పెట్టుకుంటాడు.
ఆ భగవంతుడి కటాక్షానికి జీవితకాలం సరిపోకపోవచ్చు.......కానీ గురుకృపతో ఆ భగవంతుడిని రెప్పపాటులో జగమంతటా దర్శించవచ్చు.




లోకకళ్యానార్ధం ఈ జగత్తు బరువు భాధ్యతలని తమ భుజస్కందాలపై వేసుకుని, తీరూతెన్నూ మరచి సంచరిస్తున్న నా వంటి వారికి దారి చూపిస్తూ, తోడు నడుస్తున్న ఎందరో గురుపుంగవులు.....వారదరికీ పేరు పేరునా శిరస్సు వంచి పాదాభివందనములు.

ఈ గురు పౌర్ణమి నాడు ఆ మహానుభావులు ..... నిమ్నులు, అమాయకులు (ఇంజ్ఞితజ్ఞానం లేని వారు), నిరక్షరులూ(కనీస విలువలు కూడా తెలియనివారు), చర్మకారులు (శరీరమొహం అధికంగా గలవారు), శుచికారులు (అసత్యాన్ని సత్యం అని భ్రమించి,దానిని శుభ్రపరుస్తూ జీవితాన్ని వెచ్చించువారు) అయిన నా వంటి వారిని కనికరించి......  వినయశీలత, స్వీయవిశ్వాసం, సంసిద్ధత, వేదాంతదోరణి, ఉత్తిష్టత, జాగ్రత, ప్రాప్యావరాన్నిభోదత కలిగిన జ్ఞానవైరాగ్యాలు మా పై ప్రసరింపచేయవలసిందిగా కోరూతూ వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు.

Shri Acharya Guruji Vinay 


గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీగురవేనమః 

అఖండ మండలాకారం వ్యాప్తంయేన చరాచరం 
తత్పాదందర్షితం యేన  తస్మైశ్రీ గురవేనమః 
అజ్ఞానతిమిరాన్దస్యా జ్ఞానాంజన షలాకయా
చక్షుహు ఉన్మీలితంఏనం  తస్మైశ్రీ గురవేనమః 
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం   
తత్పాదందర్షితం యేన  తస్మైశ్రీ గురవేనమః             
చిన్మయంవ్యాపి యత్సర్వం త్రైలోక్య సచరాచరం
తత్పాదందర్షితం యేన  తస్మైశ్రీ గురవేనమః 
సర్వశృతి  శిరోరత్న విరాజిత పదంభుజః 
వేదాంతాంబుజ సూర్యోయః  తస్మైశ్రీ గురవేనమః 
చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః 
బిందునాద కలాతీతః  తస్మైశ్రీ గురవేనమః 
జ్ఞానశక్తి సమారూదః తత్వ మాలా విభూషితః
భుక్తి ముక్తి ప్రదానేయ్న  తస్మైశ్రీ గురవేనమః 
అనేకజన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే
ఆత్మజ్ఞాన ప్రదానేయ్న  తస్మైశ్రీ గురవేనమః 
శోషణం భావ శిందోస్చ జ్ఞాపనం సార సంపదః
గురోర్ పాదోదకం సమ్యక్  తస్మైశ్రీ గురవేనమః 
న గురోర్ అధికం తత్వం న గురోర్ అధికం తపః 
తత్వ జ్ఞానాత్ పరంనాస్తి  తస్మైశ్రీ గురవే నమః 
   మన్నాతః శ్రీ జగనాతో మద్గురుహు శ్రీ జగద్గురుహు 
మదాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవేనమః
గురోరాది అనాదిస్చ గురుహ్ పరమదైవత్వం 
గురొహ్ పరతరంనాస్తి తస్మైశ్రీ గురవేనమః 

ధ్యానమూలం గురుర్ మూర్తిహి 
పూజామూలం గురొహ్ పదం 
మంత్రమూలం గురోర్ వాక్యం 
మోక్షమూలం గురుకృప    
               
బ్రహ్మానందం పరమ సుఖదం
కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వా తీతం గగనసద్రిషం
తత్త్వం అస్యాది లక్ష్యం 
ఏకం నిత్యం విమలం అచలం 
సర్వదీ సాక్షిభూతం
భవాతీతం త్రిగుణరహితం
సద్గురుం తం నమామి        
  

                                 



 








జై కిషన్ శింగరాజు 

Sunday, 3 July 2011

Communication (పుడితే ఈ తరంలో పుట్టాలి - 2)


ఇంటి పని చేసుకుంటున్నంత సేపు గోడ గడియారం వైపు పదే పదే చూస్తోంది.....
" పదకొండవుతోంది.....ఇదేమిటి ఈరోజు వీడు ఇంకారాలేదు " మనసులో ఆందోళన పడుతూ మరీ ఎవరికోసమో ఎదురుచూస్తోంది.

ఆ మహానగరం లో తన భర్త కాక తనకు మరెవరన్నా తెలుసంటే ఆది అతడే.
భర్త వచ్చే ముందే, తను అప్పుడప్పుడు తినేసి నిద్దుర పోతుందేమో కానీ....
అతగాడు వచ్చి వెళ్ళందే మంచినీళ్ళు కూడా ముట్టదు.పది నెలల తమ కొత్త కాపురంలో మొదటినుండీ ఇదే వరస.        
పచ్చని పొలాలు, చెరువు గట్లు...  ఉమ్మడి కుటుంబం అవడంతో ఎప్పుడూ సందడిగా ఉండే, పొలం మద్యలోని ఆ ఇల్లు, కనుచూపు మేరలో ఊరు....
ఎంతదూరం నుంచి అయినా కనపడే ఊరి మధ్యలోని చెన్నకేశవుడి గాలి గోపురం.......ఆడుతూ పాడుతూ హాయిగా సాగిపోయిన ఆ జీవితం.

" బాగా కావలిసిన వాళ్ళు, గొప్ప సంబంధం,చదువుకున్నకుర్రాడు, మంచి కుటుంబం అంటూ అందరూ కలిసి నన్ను ఇంతదూరంలోని ఈ డిల్లీలో పారేశారు... రోజంతా ఒంటరి దెయ్యంలా ఈ రెండుగదుల ఇంట్లో పడిచావలసిందే.....ఈ బాషా తెలీదు....ఈ జనాలు అంతకన్నా తెలియరు " 
ఓ గంట నుండి ఇరవయ్యోసారి పుట్టింటి ఫోటో ఆల్బం తిరగేస్తూ, కన్నీళ్లు తుడుచుకుంటూ కిటికీలోనుండి మెట్లవైపుకు తొంగిచూస్తూ మరీ బాదపడింది వరలక్ష్మి.          
               
ఇంతలో తను ఎదురు చూస్తున్నవాడు రానేవచ్చాడు....." బెహన్ జీ పోస్ట్ " చేతిలోని ఉత్తరాల కట్టని చంకలో పెట్టుకుంటూ తన ఉత్తరాన్ని చేతికి అందిస్తూ అన్నాడు పోస్ట్ మ్యాన్ సర్దార్జి.
అంతే ఒక్కసారిగా " ఏంటి నాకే " మనసులో ఉప్పొంగుతున్న ఆనందాన్ని తోక్కిపెడుతూ.....రెండంగల్లో వీదిలోకి వచ్చి చటుక్కున ఉత్తరాన్ని తీసుకుంది.
" ఇదిగో పోస్ట్ మ్యాన్ కాస్తాగు " వెళ్లి పోతున్న సర్దార్జీని తెలుగులోనే ఆగమని సైగ చేసి, లోపలనుండి రెండు సున్నుండలు తెచ్చిచ్చి మరీ తలుపేసుకుంది, ఆల్ ఇండియా రేడియోలో పని చేసే ఆనందరావు గారి భార్య వీర వెంకట వరలక్ష్మి.   

ఎంతో ఆనందం...ఏంటో తెలియని దుఖ్ఖం. ఎన్వలప్ కవర్ లో వచ్చిన ఆ ఉత్తరం, తనతో పాటు పుట్టింటి వాసనల్ని...ఆ కమ్మదనాన్ని కూడా మోసుకొచ్చింది. 

శ్రీనివాసుడి పాదాలకు తాకించి మరీ తెరవగా " ఏరా చిట్టీ బాగున్నావా ! " గుండ్రటి దస్తూరితో పలకరించిన నాన్న.అంతే అప్పటివరకు అణుచుకున్నదుఖ్ఖం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. 
వరదలా పొంగుకొస్తున్న ఆ ఆనంద కన్నీటిదారని తప్పించుకుంటూ చదవగా....

" నీ ఆరోగ్యం ఎట్టా ఉందిరా అమ్మలూ.....వేళకి తింటున్నావా.....అబ్బాయి బా చూసుకుంటున్నాడుగా "
అని నాన్న ఎన్నో విషయాలు రాయగా.... " సు గు ణ " అన్న తన పేరు తప్ప ఇంకేమీ రాయడం రాని అమ్మ, ఆ మూడు అక్షరాలలోనే ఎంతో ప్రేమని జొప్పించి పంపింది. 

" చి త్త క్కా  ఎప్పులొత్తావ్ " ఇప్పుడిప్పుడే  రాయడం నేర్చుకుంటున్న ఆఖరి బాబాయి కొడుకు చంటి...
" అక్క ఈసారి గ్యారంటీగా పాస్ అవుతా " తమ్ముడు సుబ్బు ...
" వదినా ఏమన్నా గుడ్ న్యుసా " చిలిపిగా మేనమామ కూతురు....
" చిట్టెమ్మా మన పంట బియ్యం ఓ బస్తా లారికేయిస్తా గానీ....అల్లుడ్ని దించుకోమను " పెద్ద చిన్నాన్న.....
" అక్కా తాజమహల్ ఎలాఉంది....మన ఊరి, రెడ్డి గారి బంగాళా అంత ఉంటాదంటగా " చిన్నాన్న కూతురు సంధ్య.....
" చిట్టీ ఏమన్నా వొళ్ళు చేసావా " చిన్నమ్మ ....
" చెమ్కి చీరలు దొరుకుతాయంట చూడవే " మేనత్త.... 
" నీకెప్పుడైనా ఇందిరాగాంధీ కనపడిందా " పిన్ని..... 
" ఒసేయ్ వర...అక్కడ టీవీలు ఉంటాయంటగా...నువ్వు ఎప్పుడైనా చూసావా " స్నేహితురాలు వనజ....   
" చూడమ్మాయి లక్ష్మీ...ఇంటిలో ఖాళీగా ఉండే బదులు....ఆ ఆఖరి సంవత్సరం పూర్తీచేసావంటే, డిగ్రీ చేతికొస్తుంది....ముందు ముందు ఆడా - మగా ఇద్దరు ఉద్యోగాలు చెయ్యాల్సిందే " స్కూల్ హెడ్ మాస్టర్ దానయ్యగారు.... 

ఇలా ఇంటిని....ఊరిని మోసుకొచ్చిన ఆ ఉత్తరాన్ని ఆనందంగా హత్తుకుని, తన వారందరూ ఆ చిన్న గదిలో,తన చుట్టూ కూర్చోగా, గాఢమైన నిద్దురలోకి జారుకుంది లక్ష్మీ. 


==================================================                                         
సరిగ్గా ముప్పైయేళ్ల తరువాత......

         " హలో " 

" ఎవరండీ " 
" వరలక్ష్మి గారున్నారండీ " ..... " నేనే మాట్లాడుతున్నాను....మీరెవరు...ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు ?"
" నేను గుంటూరు నుండి పూర్ణచంద్రరావు మాట్లాడుతున్నానండి ....."
" ' మీమాట - మా నోట కార్యక్రమానికి స్వాగతం పూర్ణచంద్రరావు గారు....చెప్పండి మీరు ఎవరికి... మాద్వారా ...... ఏమి చెప్పదలుచుకున్నారు ? " 
ఈ రోజూ మా ఆవిడ సుజాత పుట్టిన రోజూ మేడం....wishes చెప్పాలి "  
" ఓ గ్రేట్ ....మీకు...మీ ఆవిడగారు అంటే ఎంత ఇష్టమో మీ మాటల్ని బట్టే తెలుస్తుంది....  ఇంతకీ ఆవిడకి, మీరు మా radio ద్వార విషెస్ చెప్పబోతున్నట్టు తెలుసా ?....." 
" లేదండి....ఆవిడకి తెలియదు "          
" ఓ ....surprise చేస్తున్నారా ? "  
" కాదండీ...అసలు తను ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు .... తనేక్కడున్నా....  నా మాట తనకి వినబడుతుందేమోననే ఆశ...అంతే " 
" అంటే.....నాకర్దంకాలేదు  ? " 
" ఆ ....ఓ పది నెలల క్రితం ఏవో మనస్పర్దలోచ్చాయి....ఏవేవో జరిగాయి లెండి 
" ఓ అర్దమయింది  .... I am sorry .......సరే.... మీరు చెప్పదలచుకుంది ఏదైనాసరే హాయిగా మా ద్వారా చెప్పవచ్చు ....కానీ మీరు రేడియోలో ఏది చెప్పినా స్పష్టంగా చెప్పాలి....ఓకే నా ....చలో over to you"

" ప్రియమైన సుజాత .....నీకు పుట్టిన రోజూ శుభాకాంక్షలు....నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండు....నన్ను మన్నించు....నువ్వనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు...అసలు జరిగిన విషయం  ఏనాటికైనా నీకే తెలుస్తుంది.....జాగ్రత్త...  ఇక ఉంటాను ....ఎప్పటికీ నీ పూర్ణ..... 
Thank you madam ....."

" You are most welcome పూర్ణచంద్ర రావు గారు....కానీ నేను మరీ చనువు తీసుకుంటున్నాను అని మీరనుకోకపోతే, పెద్దదానిగా మీకు ఒక్క మాట చెప్పుతాను..... "
" అయ్యో భలే వాళ్ళే  madam ....please చెప్పండి "

" ఎవరో మహాపురుషుడు అన్నట్టుగా, ఎవరికైనా సరే, ఏదైనా చెప్పదలచుకుంది పూర్తిగా చెప్పకపోతే, ఆది చెప్పటంకోసమైనా మళ్ళా మళ్ళా జన్మలెత్తవలసివస్తుందట, వాళ్ళు కనపడేవరకు,అలా కనపడిన 
వారికి పూర్తిగా చెప్పే  వరకు..... 
                  అందుకని మీరు సుజాత గారికి చెప్పాలనుకున్నదంతా ....ఆవిడెక్కడ ఉన్నదీ తెలుసుకుని....మీ స్వహస్తాలతో చక్కగా ఓ ఉత్తరంలో రాసి పంపండి ....పశ్చాతాపమో   ప్రాయశ్చిత్తమో , జరిగినదో జరగకూడనిదో, పాపమో పుణ్యమో ఏదయితే నేమి ....నిజాయితీగా మీరు అనుకున్నది అంతా వివరంగా రాసేస్తే....జరిగేది ఎలా జరిగితే అలా జరుగుతుంది....But im sure ....  అంతా మంచే జరుగుతుంది....ఎందుకంటే మీ మనసు శాంత పడుతుంది....అది మీ చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రశాంత పరుస్తుంది.....ఆ ప్రకృతే అన్నింటిని సరిచేస్తుంది... సరేనా .....మరి నేను చెప్పినట్టు చేస్తారు కదూ ? 

"చాలా చాలా thanks అండి .....మీలా చెప్పేవాళ్ళు ముందే ఉండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో...అయినా ఇప్పటికైనా మించిపోయింది ఏమిలేదు....మీరు చెప్పినట్టే చేస్తాను....THANK YOU  once again ".       
 " I wish you all the best రావు గారు .....so ఇప్పటివరకు ' మీ మాట మా నోట ' విన్నారు కదూ ......మళ్ళా రేపు  మధ్యాహ్నం 2 గం.లకు ' మరెందరి మాటలో - మా నోట విందాం....వారి బరువెక్కిన హృదయాలకు స్వాంతన కలుగచేద్దాం....వారి పరిష్కారాలు, మన సమస్యలను కూడా తీరుస్తాఏమో  విని చూద్దాం .....అప్పటివరకు సెలవా మరి .... నమస్కారం "

===================================
" madam ఈ ఇంటర్వ్యూ లో చివరి ప్రశ్న.... మీ ఉత్తరం చిట్కాతో ఎంతోమందిని కలిపారు....మరెంతోమందిని ఆలోచింపజేస్తున్న మీ ఉత్తరం వెనుక రహస్యమేమిటి ....కాస్త వివరంగా మా ప్రేక్షకులకు తెలియచేయరూ ? "

" ఓ తప్పకుండా.... 
చూడండీ....ఈ రోజు కమ్యూనికేషన్ ఎంతో గణనీయంగా పెరిగింది.....
అసలు పుడితే ఈ తరంలో పుట్టాలి అనిపించేలా .....ఫోన్ ల దగ్గరనుండి సెల్ ఫోన్ ల వరకు..... మీ మీడియా దగ్గరనుండి ఇంటర్నెట్ వరకు ఎన్నో సాధనాలు.....అయినా రోజు రోజుకీ మనుష్యుల మధ్య పెరుగుతున్నదూరాలు.... అంతులేని అగాధాలు......ఎందుకు ? 
ఎందుకంటే మనసుని communicate చేయడం ఈ తరానికి తెలియదు కాబట్టి. 
ఈ అత్యాధునిక సాధనాలన్నీ కేవలం gadgets గానే మిగిలిపోయి.....మర్యాద, భావవ్యక్తీకరణ, ఇంజ్ఞితజ్ఞానం, భాధ్యత మొదలగు విషయాల సమ్మేళనం అయిన communication అంతరించి, రాను రాను అన్నిఉన్న మనిషి, ఏమి లేని వాడిలా మూగబోయాడు కాబట్టి. 
                                                                             
అందుకే ఉత్తరం రాయమనేది....ఒక ఉత్తరం రాయాలంటే ఎంతో ఆలోచించాలి...... ప్రతి అక్షరం కాగితం మీద పెట్టేటప్పుడు ఎంతో జాగ్రత్త గా ఉండాలి .... రాసిన ప్రతి పదానికీ రాసినవాళ్ళు భాద్యత వహించాలి....ఉత్తరం రాయాలంటే ఓర్పు సహనం ఉండి తీరాలి. అంతే కాదు......" మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తాను " అని ఎదుట వారి క్షేమాన్ని కోరగాలగాలి. " తప్పులు ఉంటే క్షమించండి " అహాన్నీవీడనాడాలిఅన్నిటికన్నా ముఖ్యంగా ఎవరికీ రాస్తున్నామో, వారి పట్ల మనకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి....ఇన్ని గొప్ప గుణాల కలయిక గనుకే, ఉత్తరం ఓ మరపురాని గుర్తుగా మిగిలిపోతుంది.


      

                                                                     
ఇలా కొంత కాలం ఉత్తరాలు రాస్తే....చక్కగా communicate చేయడం వస్తుంది.
అప్పుడు ఇంత strong communication system కలిగిన ఈ తరం, ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని communicate చేయగలిగితే....ఇక ఈ ప్రపంచాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి.            
                                                                                



      అలాగే నాలుగు అక్షరాల ప్రేమలేఖలోని మాధుర్యం....నాలుగైదు గంటల ఫోను సంభాషణలో ఎక్కడుంది.

మా నాన్నగారు పోయేవరకు నాకు రాసిన ఎన్నో ఉత్తరాలు....నన్నుఇప్పటికీ ఆయన వడిలో పడుకోపెడతాయి అంటే మీరు నమ్మకపోవచ్చు....     

                                                                          

ఎవరయినా కమ్యూనికేషన్ కోర్సు చేయాలనుకుంటే, నేను వాళ్ళ కిచ్చే సలహా ఒక్కటే..... 


ఆ కోర్సుకు వెళ్ళే బదులు, మీకు గిట్టని వాళ్లకి, మీకు నచ్చిన వాళ్ళకి, ఓ చక్కని విషయం గురించి వివరిస్తూ ఉత్తరాలు రాయండి. కమ్యూనికేషన్ లో మీకు మించిన వారు ఇక ఉండకపోవచ్చు"   
అంటూ ముగించారు ప్రఖ్యాత counselor , ప్రముఖ All India Radio వ్యాఖ్యత శ్రీమతి వీరవెంకట వరలక్ష్మీ గారు. 


జైకిషన్ శింగరాజు