జలపాతం

జలపాతం
ఆకలి వేసి ఏడుస్తున్న, బిడ్డని చూసిన తల్లిని ఆపడం....రామ నామ జపం చేస్తున్న చోటుకి వెళ్ళకుండా హనుమయ్యని ఆపడం.....మనిషిలోని 'ఆ మనిషిని' తట్టిలేపుటకు జాలువారిన ఈ " జలపాతం " జోరును ఆపడం.....బహుశా ఎవరికీ సాధ్యం కాదు - జైకిషన్ శింగరాజు

Friday, 17 June 2011

విజ్ఞానం (పుడితే ఈ తరంలో పుట్టాలి - 1)


ఎవరో మహానుభావుడు చెప్పినట్టుగా ....పుడితే ఈ తరంలో పుట్టాలి.


        అని పాడుకుంటూ ఇల్లు తడిగుడ్డ పెట్టి తుడుస్తున్న ఓ తెలుగు విద్యార్ధికి ఖాళీగా కనపడ్డారు గురువు గారు. 


"గురువుగారు నాకు కనీసం ఈరోజయినా ' నన్నయ్య భట్టారకుడి ' విశేషాలు .....ఆది కవి ' ఆంధ్ర మహాభారత ' సాహిత్య వివరాలు గూర్చి వివరించండి....ఇప్పటికే నేను వచ్చి నెల రోజులు దాటుతోంది"  అంటూ ప్రాధేయపడ్డాడు తెలుగు సాహిత్యంలో Phd చేస్తున్న గోపాలంభట్ల శివ శంకర సుభ్రమణ్య శర్మ .

" ఒరేయ్ ఒరేయ్.....సుబ్బూ.... నాకు మటుకు నా వద్ద ఉన్నదంతా నీకు అప్పచేప్పాలని లేదట్రా  ? దేనికైనా సమయం రావాలి....కాస్త ఓపిక పట్టు వివరంగా అన్నీ తెలుసుకుందువుగాని " అంటూ నోట్లో తమలపాకులు  వేసుకుంటూ లేచెళ్ళారు , తెలుగు సాహిత్య పరిషద్ ఉపాధ్యక్షులు , తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకులు , పండితోత్తములు శ్రీ చతుర్వేదుల వీర వెంకట భగవన్నాద రామలింగేశ్వరుడు గారు.

"ఒరేయ్ వెర్రి సన్నాసి....భేషుగ్గా MA వరకు చదివి ఇదేమి కర్మ రా నీకు....లక్షణంగా మీ మావగారు తహిసిల్దార్ ఉద్యోగం వేయిస్తానంటే,  సాహిత్యము నా పిండాకూడు అంటూ వీడెవడి దగ్గరో పాలేరు వెదవలా ఊడిగం చేసుకుంటూ బ్రతుకుతానంటా  వెంటిరా అంట్లవెదవ " గురువుగారి ఇంటి వీదీ చివర, శివాలయం వద్దకు పిలిపించుకుని మరి తలంటాడు నాన్న....అయినా లాభం లేదు.                

రోజులూ వారాలూ నెలలూ ఏళ్ళు  ...అయ్యవారి కాళ్ళు పడుతూ.....అమ్మగారి దోసెల పిండి రుబ్బుతూ.....పాపాయి తల దువ్వుతూ.....బాబుని బడిలో దింపుతూ.....మొక్కలకు అంట్లు కడుతూ ......పాలేరు రాకపోతే అంట్లు తోముతూ.....పాలు పిండుతూ ....ఇలా దేనికైనా సిద్దపడుతూ మొత్తానికి ఎన్నో ఏళ్ళకు గురువుగారి పాండిత్యాన్ని  సాధించాడు పట్టు వదలని సుబ్రహ్మణ్యం.

=======================================                         

సరిగ్గా 50  ఏళ్ళ తరువాత ఒక రోజూ అనుకోకుండా , స్పేస్ బార్ లో ' నన్నయ్య ' అని టైప్ చేసారు Prof.G .S .S .S .SARMA . ప్రముఖ కవులు, retd . తెలుగు అధ్యాపకులు(ఆంధ్ర విశ్వవిద్యాలయం) , అధ్యక్షులు.తెలుగు సాహిత్య అకాడమి ( ఆం.ప్ర). 

అయన టైపు చేసిన వెంటనే,సెకను కన్నా తక్కువ సమయంలో, నన్నయ్య గారి తల్లిగారికి పురుడు పోసిన మంత్ర సాని వివరాల దగ్గర నుండి అయన పుట్టు పూర్వత్రాలు, విద్యాభ్యాసం, అయన రచించిన ఆణిముత్యాలు , గద్య కావ్యాన్ని పద్య కావ్యాన్ని కలుపుతూ వ్రాసే చంపు రీతిలో వ్రాసిన శబ్దాంధ్ర మహాభారతం - దాని పద్య సంపుటి, ఆది కవి, శబ్ద శాసనుడు , ఆంధ్ర శబ్ద చింతామణి మొదలగు బిరుదులూ....ఇలా ఒకటేమిటి....ఏ వివరం కావాలంటే ఆ వివరం....సెకన్లలో ఆయన ముందున్నాయి.

 " ఆహా ఎంత గొప్ప టెక్నాలజీ.....నిజంగా పుడితే ఈ తరంలో పుట్టాలి.... ఈ జ్ఞానం కోసం మాలాగా ఏళ్ళ కేళ్ళు వ్యర్ధ పరుచుకో నక్కరలేదు " అంటూ ఆనందంగా చూస్తున్నారు ప్రోఫెసోర్ గారు.   

"జీవితానికి జ్ఞానం ఒకటే సరిపోతుందా తాతగారు.....దానిని వినియోగించగలిగే అవగాహన ఉండద్దు"తత్వాన్ని ఉపదేసించినట్టుగా చెప్పింది మనుమరాలు Dr.ఈమని శ్రేయా శ్రీనివాస్, ప్రముఖ psychologist .

" మీరు అలా కష్టించి నేర్చుకోబట్టే, జీవితం పట్ల మీకు అవగాహన ,నేర్చిన విద్య పట్ల మీకు గౌరవం , సాధన ద్వారా దానిని మరింత మెరుగుపరచాలన్న తృష్ణ మొదలగు అమూల్యమయిన లక్షణాలు మీలో పెంపొందింపబడ్డాయి.
అందుకే సాధించిన దానిని పది మందికి పంచగలిగారు.మరి ఆ అవకాశాలు ఈ తరం వారికెక్కడివి. ఎంత సులువుగా జ్ఞానం లభిస్తున్నా రోజూ రోజుకి మనిషి లోని మనిషి అంతరించి పోతున్నాడు అంటే అదే కారణం"
 అని హడావుడిగా లేస్తూ "వెళ్లొస్తాను తాతగారు....మామయ్య కి ఫోన్ చెయ్యాలంటే ఇప్పుడే చెయ్యండి.... ఇండియాలో ఇప్పుడు సాయంత్రం 8 అవుతుంది....ఆలస్యం అయితే పడుకుండిపోతారు " అంటూ కార్ తాళాలు తీసుకుని clinic కి వెళ్లి పోయింది Dr.శ్రేయ

                                 
===============================================


గురుకులంలో గురుముఖంగా విద్య  నేర్చిన విద్యార్ధి, జ్ఞానంతో పాటు .....నేర్చిన విద్య పట్ల అపారమైన గౌరవం, జీవితంలో క్రమశిక్షణ, భాద్యతలపట్ల నిజాయితీ, చేసే పని పట్ల నిబద్ధత మొదలగు చక్కటి గుణాల సమ్మేళనంతో విద్య నబ్యసించి,  ఓ చక్కని సంస్కారం కలిగిన మనిషి గా వెలుగొందగలిగేవాడు. 


శ్రీ రాముడి దగ్గర నుండి స్వామి వివేకానందుడి వరకు, ఎందరో మహానుభావులకు లభించిన ఆ అవకాసం, పాపం ఈ తరానికెక్కడిదీ ? అపారమైన జ్ఞానం విచ్చలవిడిగా ' on - line ' లో దొరుకుతున్నా, కమ్యూనికేషన్ రంగం ప్రపంచాన్నికుగ్రామంగా మార్చేసినా.... 
అటు విద్యావిధానంలో, దానిని నేర్పుతున్న విద్యాలయాలలో, ఇటు పెంపకాలలో, దాని నుండి తయారయిన  సమాజంలో రోజు రోజుకీ క్షీణిస్తున్నకనీస విలువలు మనిషి లోని మనిషిని హరింపజేస్తున్నాయి.

పాలకుల దగ్గరనుండి భోదకుల వరకు, తల్లితండ్రుల నుండి భాద్యత కలిగిన విద్యాదికులవరకు, ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితిని సమీక్షించి....Technology మెండుగా గలిగిన ఈ తరానికి, మానవీయ దృక్కోణాన్నిజోడించి, విలువలని  పెంపొందించ గలిగితే....

మహోన్నతమైన సౌజన్యం, ఔదార్యం, పావనత, ప్రశాంతత -  అన్నింటినీ మించి ఆద్యాత్మికత, అంతర్వీక్షనాలను మానవాళికి అందించిన మహత్తరమైన భూమి ఈ విశ్వంలో ఎక్కడైనా ఉంటే, అదే నా భరత భూమి " అన్న స్వామి వివేకానందుడి మాటలు ఎల్లప్పుడూ చిరంజీవిలుగా వర్దిల్లుతాయి.   



ఓం నమో భగవతే వాసుదేవయనమః 
      


                     
జైకిషన్ శింగరాజు 

     
      

No comments:

Post a Comment