జలపాతం

జలపాతం
ఆకలి వేసి ఏడుస్తున్న, బిడ్డని చూసిన తల్లిని ఆపడం....రామ నామ జపం చేస్తున్న చోటుకి వెళ్ళకుండా హనుమయ్యని ఆపడం.....మనిషిలోని 'ఆ మనిషిని' తట్టిలేపుటకు జాలువారిన ఈ " జలపాతం " జోరును ఆపడం.....బహుశా ఎవరికీ సాధ్యం కాదు - జైకిషన్ శింగరాజు

Sunday, 19 June 2011

ఆ కాలి ముద్రలు నావి అనుకున్నాను....


'ఇప్పుడప్పుడే తెల్లారదు' అన్న దీమానో ఏంటో,వీదీలెమ్మడి పొగ మంచు వీర విహారం చేస్తోందీ.....కటిక నిశబ్దాన్ని ఛేదిస్తూ గోడ గడియారం లోని సెకెన్ల ముల్లు - గుండె చప్పుడుతో చేతులు కలిపింది....మనసు భారాన్ని పంచు కున్నందుకేమో సమయం కూడా భారంగా, రెండుగంటల నుండి పదినిముషాలు నడవడానికి అవస్థ పడుతోంది.            
  
మస్తిష్కాన్ని కకా వికలం చేస్తూ వచ్చి చేరుతున్న జ్ఞాపకాలూ.....శరీరాన్నీ, దాని చేతుల్లోని వెచ్చని కాఫీ కప్పునీ ఆ గదిలోనే వదిలి, మదిని టైంమిషిన్ విహారానికి పట్టుకు పోయిన గత స్మృతులు.
                        
======================================

ప్రొద్దున్నే నిద్ర లేచేసరికి, ఎదురుగా కనపడ్డ కొత్త బూట్లు....బైండింగ్ వేయించిన కొత్త పుస్తకాలు....కొత్త బ్యాగ్గు...ఆనందంగా వాటి వద్దకు వెళుతుంటే " త్వరగా వెళ్లి తయారవ్వు స్కూల్ టైమవుతుంది "... హడల్ కొట్టేలా వెనుక నుండి ఓ పెద్ద అరుపు.....

"నేను ఏడవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యా ......రాత్రి చెప్పుదామంటే, మీరు ఎంతకీ రాలేదు "   
"ఊ...సరే...ఇల్లు అలకగానే పండుగ్గాదు....ముందు ముందు పదో తరగతి పాసవ్వాలి " 
ఆనందం కాస్తా ఆవిరయ్యింది. దిగాలుగా వరండాలో కొచ్చి చూసేసరికి ' కొత్త Hero Ranger '.....
" హాయ్.... ఇప్పుటి వరకు ఈ సైకిల్ మా స్కూల్లో కాదు కదా....మా వూర్లో కూడా లేదు " ఆ ఆనందం తో ఆ ఊరిని ఓ వంద చుట్లు చుట్టాను.


" అమ్మా... నాన్న, పండూ వాళ్ళ నాన్న లాగ ఎప్పుడు పడితే అప్పుడు ఊర్లు వెళ్ళరా ? "  
" ష్....తప్పు అలా మాట్లడగూడదు.....నువ్వు బుద్ధి గా వుంటే ఆయన మటుకూ ఎందుకు కొడతారు " వంటి మీద వాతలు తేలిన బెల్టు దెబ్బలకి వెన్న పూస రాస్తూ సముదాయించింది ఆమ్మ.


"నాకంత కర్మ పట్టలేదు....నేనేమి మీ మోచేతి నీళ్ళు త్రాగి బ్రతకట్లేదు....మీరు ఈరోజు తెస్తున్న జీతానికి ఐదు రెట్ల ఎక్కువ జీతం నాది....కావాలనుకుంటే మా అమ్మని నాదగ్గరకి తీసుకెళ్ళి మహారాణిలా చూసుకోగలను" ఎవరు చదివిస్తే నేను చదువుకోగలిగానో, ఇంతడి వాడిని అయ్యానో.... 

ఆ విషయాలు ఏవీ ఆ రోజు నాకు గుర్తుకు రానివ్వని నా ఆవేశం....ఆయనతో మాటలు మాన్పించి మూడు సంవత్సరాలు దాటుతోంది.


నీళ్లెన్డిన చెరువులోంచి బయట పడ్డ చేపలాగ, ఆర్దిక మాంద్యం దెబ్బకి గిలగిల్లాడిన ప్రపంచ ఆర్దిక వ్యవస్థ, మకుటంలేని మహారాజులమని, మాకు మేమే సాటి అని విర్ర వీగిన మా లాంటి వాళ్ళ భ్రమని తొలిగిస్తూ, కళ్ళు తెరిపించే సరికి ఇంకేముంది......ఉద్యోగం పోయి రెండు నెలలయ్యింది.


తప్పని ఇంటి అద్దెలు, EMI లు, కరిగిపోయిన సేవింగులు, 'సున్నా' చుట్టిన బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇంకా మిగిలిన ఎడ్జెస్ట్మెంట్లు.......


కోటకట్టిన ఆత్మాభిమానం, కరుడుకట్టిన అహంభావం....అమ్మక్కూడా కూడా చెప్పుకోలేని  అయోమయం.
ఇంతలో..... 'కీ... కీ '....sms..... Rs.30000 has been credited to your account.Your present balance is Rs.28982.... అవాక్కయి బ్యాంకుకు పరిగెత్తగా....వారు చెప్పిన విషయం విని   గత 14 గంటల నుండి తెరుకుంటూనే ఉన్నాను. 

సాయంత్రం ఏడవ తరగతి ఫలితాలోస్తే, తెల్లారేసరికి వాకిట్లోకి కొత్త సైకిల్ ఎలా వచ్చిందని ఆనాడు అడగలేదు.....ఇక్కడ నా పరిస్థితి మీకెలా తెలుసని ఈనాడు అడగ దలుచుకోలేదు....కేవలం " నన్ను క్షమించండి నాన్న...నేను ఏనాడు మిమ్మల్ని అర్ధం చేసుకోలేదు " అని మాత్రమే చెప్ప దలచుకున్నాను ....తెల్లారితే ఫోను చేద్దామని, ఫోను పట్టుకుని మరీ యుగ - యుగాలుగా ఎదురుచూస్తున్నాను.                                                          


" హలో " .....
" ఆ .....నేను " ...... 
" మీ ఆమ్మ బయట కూరలు కొంటోంది....కొంచం అయ్యాక చెయ్యి "
" నాన్న ....నేను మీతోనే మాట్లాడాలి "  
" నాతో నా ..."  
" అవును నాన్న....." దుఖ్ఖం గొంతుని పూడ్చేస్తుండగా " నన్ను క్షమించండి నాన్న..... "
కన్నీటి దారా ప్రవాహం పొంగిపొర్లగా.....బరవయిన హృదయాలను కరిగిస్తున్న దుఖ్ఖంలో అటు నాన్న ఇటు నేను....
ముందుగా తేరుకున్న నాన్న" ఒరేయ్ కన్నా....ఇవ్వవలసిన వాళ్ళందరికీ సదిరేసి నువ్వు సామాను సదురుకుని వెంటనే బయలుదేరు...పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళా వెళ్ళుదువు గాని ....ఆమ్మ వచ్చేలా ఉంది....సరేనా....ఇదిగో మీ అబ్బాయి ఫోను " తనదైన శైలిలో ఫోను అమ్మకిచ్చి వెళ్ళిపోయారు నాన్న.
 
=================================


ఆ కాలిముద్రలు నడుస్తున్న నావి అనుకున్నాను...ఇప్పుడు తెలిసింది అవి నన్ను మోస్తున్న మీవని.
కనిపెట్టే ప్రేమ తల్లిది......నిలబెట్టే ప్రేమ తండ్రిది
  అది కన్న తండ్రైనా......జగాలేలే చల్లని తండ్రైనా   


HAPPY FATHER's DAY
  


జైకిషన్ శింగరాజు                     

4 comments:

  1. మా నాన్నగారు మాకెంత చేసారో అన్న ఆలోచనలో పడి కళ్ళు చెమర్చాయి.

    ReplyDelete
  2. కనిపెట్టే ప్రేమ తల్లిది......నిలబెట్టే ప్రేమ తండ్రిది
    అది కన్న తండ్రైనా......జగాలేలే చల్లని తండ్రైనా

    బాగా చెప్పారండి

    ReplyDelete