"సముద్రవసనే దేవి
పర్వతస్థన మండలే
విష్ణు పత్నీ నమస్తుభ్యం
పాద ఘాతం క్షమస్వమే"
అని నమస్కరిస్తే గాని, నిద్రలేచాక పక్క మీదనుండి భూమి మీదకి, కాలు కూడా మోపని మహోన్నతమైన జాతి మనది .
అడవులను వనదేవతలుగా, ఆ మూగజీవాలను విశ్వవ్యాప్తమయిన భగవత్ స్వరూపాలుగా, నదులను పుణ్య మూర్తులుగా, పర్వతాలను ధ్యానముద్రలో కూర్చుని ఉన్న ముని పుంగవులుగా.....
చెరువులూ, కుంటలూ మొదలగు వాటిని ఆ ఊరి శివాలయంలోని శివయ్య కొరకు వేచిఉన్న గంగమ్మతల్లిగా, మా కడుపు కోసం ఈ నాగలి పోటూ - క్షమించు తల్లీ,అని నమస్కరించి కష్టించగా, ఇంద్రాది వరుణదేవతలు సహకరించగా, చేతికొచ్చిన పచ్చని పంటని, ఉండబట్టలేక తమ ఊరి విశ్వనాథుని చెంతకురికొచ్చిన అన్నపూర్ణేశ్వరిగా.....ఆ పంట తెచ్చిన సిరిని, ' దాచుకున్నారట్రా నా స్వామిని మీ ముంగిట ' అంటూ కొల్హాపురం గడప దాటొచ్చిన ' శీనయ్య పట్టమహిషి ' గా.....ఒకటేమిటి కంటికి కనపడ్డ చెట్టు - పుట్టా కొండా - బండా నీరు - నిప్పు ....ఇలా ప్రతిదానిలోనూ ఆ చిద్విలాస స్వరూపాన్ని దర్శిం పజేసిన దివ్యమైన ధర్మం మనది.
ఊరి చెరువు మధ్యలోని మెత్తని బంకమన్నును తవ్వి తీసి, తొమ్మిది రోజుల పాటు వొదిలేస్తే చెరువులోకి నీటి ఊట....తరువాత అలా తీసిన
మట్టికి, వనమూలికలు, ఔషద గుణాలున్నఆకులు అలములు జతకలిపి ఆ చెరువు మధ్యలోకి ' నిమర్జనం ' చేస్తే ఇక మళ్ళా వచ్చే'భాద్రపద చవితి' దాకా చెరువు పరిశుభ్రం అన్న మాట.
![]() |
| మట్టితో చేసిన వినాయకుడు ఇలా ప్రతి పండుగా, ప్రతి నియమము, ప్రతి మంత్రము, ప్రతి చర్య -- ప్రకృతి వొడిలో ఆ ప్రకృతిని పెనవేసుకుని ప్రకృతిని అనుసరిస్తూ ప్రాకృతికంగా నిర్దేసింపబడిన గొప్ప సంస్కృతి. |
సముద్రవసనే దేవి - రాబోయేకాలంలో ఆ వసనంతోనే నిన్నుపూర్తిగా కప్పేసే ప్రమాదం పొంచి ఉంది తల్లీ.
పర్వతస్థన మండలే - మా కడుపులు నింపిన ఆ గోముఖం...గంగోత్రికి నేడు బహు దూరం.
విష్ణు పత్నీ నమస్తుభ్యం - చేతులు కాలాయి, ఇక ఆకులు పట్టి నమస్కరిస్తాం(ఆకులూ కరువే సుమా)
పాద ఘాతం క్షమస్వమే - ఒక్క పాదం ఏమీ కర్మ...
.....బుల్ డోజర్ల ఘాతం క్షమస్వమే....
సహజ వాయువల కోసం నీ వంటి నిండా చిల్లులు పెట్టి జల్లెడ కొడుతున్నాం, డ్రిల్లెర్ల (drillers) ఘాతం క్షమస్వమే...బౌగోళిక సమతుల్యాన్ని కాపాడే కొండల్ని పిండి కొడుతున్నాం, డైనమైట్ల ఘాతం క్షమస్వమే...
ప్రమాదమని తెలిసి కూడా నీలో జీర్ణం కానీ ప్లాస్టిక్ని విచ్చలవిడిగా తయారు చేసి, నీ నెత్తిన పారేస్తున్నాం, ప్లాస్టిక్ ఘాతం క్షమస్వమే......
ఇలా మేము చేస్తున్న ఆకృత్యాల దండకం అంతా విని, మమ్మల్ని నీవైతే క్షమించగలవేమో కానీ (భూదేవికి ఓర్పు ఎక్కువంటారుగా), మా భావితరాలు మాత్రం మమ్మల్ని ఎప్పటికీ క్షమించరు.
రోజూ రోజుకీ నవ నాగరికం - అభివృద్ధి పేరుతో, మనిషి అభినవ హిరణ్యాక్షుడుగా మారి, నందనవనంగా వెలుగొందవలసిన ఈ భూమండలాన్ని, రుద్రభూమిగా - నిర్జీవమైన జల సమాధిగా మార్చేస్తున్నా,మౌనంగా తిలకిస్తున్న ఆ ప్రళయ వరాహమూర్తికి విన్నవించి, మా తత్వాన్ని పెంపొందించి, మమ్మల్ని ఉద్దరించి, మా భవిష్యత్తు తరాలవారికి ప్రాణవాయువు నిలిచేలా చూడు తల్లీ ధరణీ మాతా.
ధనుర్ధరాయై చ విద్మహే
సర్వ సిద్ధాయై చ ధీమహీ
తన్నో ధరా ప్రచోదయాత్
జైకిషన్ శింగరాజు


No comments:
Post a Comment