ఇంటి పని చేసుకుంటున్నంత సేపు గోడ గడియారం వైపు పదే పదే చూస్తోంది.....
" పదకొండవుతోంది.....ఇదేమిటి ఈరోజు వీడు ఇంకారాలేదు " మనసులో ఆందోళన పడుతూ మరీ ఎవరికోసమో ఎదురుచూస్తోంది.
ఆ మహానగరం లో తన భర్త కాక తనకు మరెవరన్నా తెలుసంటే ఆది అతడే.
భర్త వచ్చే ముందే, తను అప్పుడప్పుడు తినేసి నిద్దుర పోతుందేమో కానీ. ...
అతగాడు వచ్చి వెళ్ళందే మంచినీళ్ళు కూడా ముట్టదు.పది నెలల తమ కొత్త కాపురంలో మొదటినుండీ ఇదే వరస.
పచ్చని పొలాలు, చెరువు గట్లు... ఉమ్మడి కుటుంబం అవడంతో ఎప్పుడూ సందడిగా ఉండే, పొలం మద్యలోని ఆ ఇల్లు, కనుచూపు మేరలో ఊరు....
ఎంతదూరం నుంచి అయినా కనపడే ఊరి మధ్యలోని చెన్నకేశవుడి గాలి గోపురం.......ఆడుతూ పాడుతూ హాయిగా సాగిపోయిన ఆ జీవితం.
" బాగా కావలిసిన వాళ్ళు, గొప్ప సంబంధం,చదువుకున్నకుర్రాడు, మంచి కుటుంబం అంటూ అందరూ కలిసి నన్ను ఇంతదూరంలోని ఈ డిల్లీలో పారేశారు... రోజంతా ఒంటరి దెయ్యంలా ఈ రెండుగదుల ఇంట్లో పడిచావలసిందే.....ఈ బాషా తెలీదు....ఈ జనాలు అంతకన్నా తెలియరు "
ఓ గంట నుండి ఇరవయ్యోసారి పుట్టింటి ఫోటో ఆల్బం తిరగేస్తూ, కన్నీళ్లు తుడుచుకుంటూ కిటికీలోనుండి మెట్లవైపుకు తొంగిచూస్తూ మరీ బాదపడింది వరలక్ష్మి.
ఇంతలో తను ఎదురు చూస్తున్నవాడు రానేవచ్చాడు....." బెహన్ జీ పోస్ట్ " చేతిలోని ఉత్తరాల కట్టని చంకలో పెట్టుకుంటూ తన ఉత్తరాన్ని చేతికి అందిస్తూ అన్నాడు పోస్ట్ మ్యాన్ సర్దార్జి.
అంతే ఒక్కసారిగా " ఏంటి నాకే " మనసులో ఉప్పొంగుతున్న ఆనందాన్ని తోక్కిపెడుతూ.....రెండంగల్లో వీదిలోకి వచ్చి చటుక్కున ఉత్తరాన్ని తీసుకుంది.
" ఇదిగో పోస్ట్ మ్యాన్ కాస్తాగు " వెళ్లి పోతున్న సర్దార్జీని తెలుగులోనే ఆగమని సైగ చేసి, లోపలనుండి రెండు సున్నుండలు తెచ్చిచ్చి మరీ తలుపేసుకుంది, ఆల్ ఇండియా రేడియోలో పని చేసే ఆనందరావు గారి భార్య వీర వెంకట వరలక్ష్మి.
ఎంతో ఆనందం...ఏంటో తెలియని దుఖ్ఖం. ఎన్వలప్ కవర్ లో వచ్చిన ఆ ఉత్తరం, తనతో పాటు పుట్టింటి వాసనల్ని...ఆ కమ్మదనాన్ని కూడా మోసుకొచ్చింది.
శ్రీనివాసుడి పాదాలకు తాకించి మరీ తెరవగా " ఏరా చిట్టీ బాగున్నావా ! " గుండ్రటి దస్తూరితో పలకరించిన నాన్న.అంతే అప్పటివరకు అణుచుకున్నదుఖ్ఖం ఒక్కసారిగా తన్నుకొచ్చింది.
వరదలా పొంగుకొస్తున్న ఆ ఆనంద కన్నీటిదారని తప్పించుకుంటూ చదవగా....
" నీ ఆరోగ్యం ఎట్టా ఉందిరా అమ్మలూ.....వేళకి తింటున్నావా.....అబ్బాయి బా చూసుకుంటున్నాడుగా "
అని నాన్న ఎన్నో విషయాలు రాయగా.... " సు గు ణ " అన్న తన పేరు తప్ప ఇంకేమీ రాయడం రాని అమ్మ, ఆ మూడు అక్షరాలలోనే ఎంతో ప్రేమని జొప్పించి పంపింది.
" చి త్త క్కా ఎప్పులొత్తావ్ " ఇప్పుడిప్పుడే రాయడం నేర్చుకుంటున్న ఆఖరి బాబాయి కొడుకు చంటి...
" అక్క ఈసారి గ్యారంటీగా పాస్ అవుతా " తమ్ముడు సుబ్బు ...
" వదినా ఏమన్నా గుడ్ న్యుసా " చిలిపిగా మేనమామ కూతురు....
" చిట్టెమ్మా మన పంట బియ్యం ఓ బస్తా లారికేయిస్తా గానీ....అల్లుడ్ని దించుకోమను " పెద్ద చిన్నాన్న.....
" అక్కా తాజమహల్ ఎలాఉంది....మన ఊరి, రెడ్డి గారి బంగాళా అంత ఉంటాదంటగా " చిన్నాన్న కూతురు సంధ్య.....
" చిట్టీ ఏమన్నా వొళ్ళు చేసావా " చిన్నమ్మ ....
" చెమ్కి చీరలు దొరుకుతాయంట చూడవే " మేనత్త....
" నీకెప్పుడైనా ఇందిరాగాంధీ కనపడిందా " పిన్ని.....
" ఒసేయ్ వర...అక్కడ టీవీలు ఉంటాయంటగా...నువ్వు ఎప్పుడైనా చూసావా " స్నేహితురాలు వనజ....
" చూడమ్మాయి లక్ష్మీ...ఇంటిలో ఖాళీగా ఉండే బదులు....ఆ ఆఖరి సంవత్సరం పూర్తీచేసావంటే, డిగ్రీ చేతికొస్తుంది....ముందు ముందు ఆడా - మగా ఇద్దరు ఉద్యోగాలు చెయ్యాల్సిందే " స్కూల్ హెడ్ మాస్టర్ దానయ్యగారు....
ఇలా ఇంటిని....ఊరిని మోసుకొచ్చిన ఆ ఉత్తరాన్ని ఆనందంగా హత్తుకుని, తన వారందరూ ఆ చిన్న గదిలో,తన చుట్టూ కూర్చోగా, గాఢమైన నిద్దురలోకి జారుకుంది లక్ష్మీ.
============================== ====================
సరిగ్గా ముప్పైయేళ్ల తరువాత......
" హలో "
" ఎవరండీ "
" వరలక్ష్మి గారున్నారండీ " ..... " నేనే మాట్లాడుతున్నాను....మీరెవరు... ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు ?"
" నేను గుంటూరు నుండి పూర్ణచంద్రరావు మాట్లాడుతున్నానండి ....."
" ' మీమాట - మా నోట ' కార్యక్రమానికి స్వాగతం పూర్ణచంద్రరావు గారు....చెప్పండి మీరు ఎవరికి... మాద్వారా ...... ఏమి చెప్పదలుచుకున్నారు ? "
" ఈ రోజూ మా ఆవిడ సుజాత పుట్టిన రోజూ మేడం....wishes చెప్పాలి "
" ఓ గ్రేట్ ....మీకు...మీ ఆవిడగారు అంటే ఎంత ఇష్టమో మీ మాటల్ని బట్టే తెలుస్తుంది.... ఇంతకీ ఆవిడకి, మీరు మా radio ద్వార విషెస్ చెప్పబోతున్నట్టు తెలుసా ?....."
" లేదండి....ఆవిడకి తెలియదు "
" ఓ ....surprise చేస్తున్నారా ? "
" కాదండీ...అసలు తను ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు .... తనేక్కడున్నా.... నా మాట తనకి వినబడుతుందేమోననే ఆశ...అంతే "
" అంటే.....నాకర్దంకాలేదు ? "
" ఆ ....ఓ పది నెలల క్రితం ఏవో మనస్పర్దలోచ్చాయి....ఏవేవో జరిగాయి లెండి "
" ఓ అర్దమయింది .... I am sorry .......సరే.... మీరు చెప్పదలచుకుంది ఏదైనాసరే హాయిగా మా ద్వారా చెప్పవచ్చు ....కానీ మీరు రేడియోలో ఏది చెప్పినా స్పష్టంగా చెప్పాలి....ఓకే నా ....చలో over to you"
" ప్రియమైన సుజాత .....నీకు పుట్టిన రోజూ శుభాకాంక్షలు....నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండు....నన్ను మన్నించు....నువ్వనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు...అసలు జరిగిన విషయం ఏనాటికైనా నీకే తెలుస్తుంది.....జాగ్రత్త... ఇక ఉంటాను ....ఎప్పటికీ నీ పూర్ణ.....
Thank you madam ....."
" You are most welcome పూర్ణచంద్ర రావు గారు....కానీ నేను మరీ చనువు తీసుకుంటున్నాను అని మీరనుకోకపోతే, పెద్దదానిగా మీకు ఒక్క మాట చెప్పుతాను..... "
" అయ్యో భలే వాళ్ళే madam ....please చెప్పండి "
" ఎవరో మహాపురుషుడు అన్నట్టుగా, ఎవరికైనా సరే, ఏదైనా చెప్పదలచుకుంది పూర్తిగా చెప్పకపోతే, ఆది చెప్పటంకోసమైనా మళ్ళా మళ్ళా జన్మలెత్తవలసివస్తుందట, వాళ్ళు కనపడేవరకు,అలా కనపడిన
వారికి పూర్తిగా చెప్పే వరకు.....
అందుకని మీరు సుజాత గారికి చెప్పాలనుకున్నదంతా ....ఆవిడెక్కడ ఉన్నదీ తెలుసుకుని....మీ స్వహస్తాలతో చక్కగా ఓ ఉత్తరంలో రాసి పంపండి ....పశ్చాతాపమో ప్రాయశ్చిత్తమో , జరిగినదో జరగకూడనిదో, పాపమో పుణ్యమో ఏదయితే నేమి ....నిజాయితీగా మీరు అనుకున్నది అంతా వివరంగా రాసేస్తే....జరిగేది ఎలా జరిగితే అలా జరుగుతుంది....But im sure .... అంతా మంచే జరుగుతుంది....ఎందుకంటే మీ మనసు శాంత పడుతుంది....అది మీ చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రశాంత పరుస్తుంది.....ఆ ప్రకృతే అన్నింటిని సరిచేస్తుంది... సరేనా .....మరి నేను చెప్పినట్టు చేస్తారు కదూ ? "
"చాలా చాలా thanks అండి .....మీలా చెప్పేవాళ్ళు ముందే ఉండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో...అయినా ఇప్పటికైనా మించిపోయింది ఏమిలేదు....మీరు చెప్పినట్టే చేస్తాను....THANK YOU once again ".
" I wish you all the best రావు గారు .....so ఇప్పటివరకు ' మీ మాట మా నోట ' విన్నారు కదూ ......మళ్ళా రేపు మధ్యాహ్నం 2 గం.లకు ' మరెందరి మాటలో - మా నోట విందాం....వారి బరువెక్కిన హృదయాలకు స్వాంతన కలుగచేద్దాం....వారి పరిష్కారాలు, మన సమస్యలను కూడా తీరుస్తాఏమో విని చూద్దాం .....అప్పటివరకు సెలవా మరి .... నమస్కారం "
============================== =====
" madam ఈ ఇంటర్వ్యూ లో చివరి ప్రశ్న.... మీ ఉత్తరం చిట్కాతో ఎంతోమందిని కలిపారు....మరెంతోమందిని ఆలోచింపజేస్తున్న మీ ఉత్తరం వెనుక రహస్యమేమిటి ....కాస్త వివరంగా మా ప్రేక్షకులకు తెలియచేయరూ ? "
" ఓ తప్పకుండా....
చూడండీ....ఈ రోజు కమ్యూనికేషన్ ఎంతో గణనీయంగా పెరిగింది.....
అసలు పుడితే ఈ తరంలో పుట్టాలి అనిపించేలా .....ఫోన్ ల దగ్గరనుండి సెల్ ఫోన్ ల వరకు..... మీ మీడియా దగ్గరనుండి ఇంటర్నెట్ వరకు ఎన్నో సాధనాలు.....అయినా రోజు రోజుకీ మనుష్యుల మధ్య పెరుగుతున్నదూరాలు.... అంతులేని అగాధాలు......ఎందుకు ?
ఎందుకంటే మనసుని communicate చేయడం ఈ తరానికి తెలియదు కాబట్టి.
ఈ అత్యాధునిక సాధనాలన్నీ కేవలం gadgets గానే మిగిలిపోయి.....మర్యాద, భావవ్యక్తీకరణ, ఇంజ్ఞితజ్ఞానం, భాధ్యత మొదలగు విషయాల సమ్మేళనం అయిన communication అంతరించి, రాను రాను అన్నిఉన్న మనిషి, ఏమి లేని వాడిలా మూగబోయాడు కాబట్టి.
అప్పుడు ఇంత strong communication system కలిగిన ఈ తరం, ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని communicate చేయగలిగితే....ఇక ఈ ప్రపంచాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి.
అలాగే నాలుగు అక్షరాల ప్రేమలేఖలోని మాధుర్యం....నాలుగైదు గంటల ఫోను సంభాషణలో ఎక్కడుంది.
అలాగే నాలుగు అక్షరాల ప్రేమలేఖలోని మాధుర్యం....నాలుగైదు గంటల ఫోను సంభాషణలో ఎక్కడుంది.
మా నాన్నగారు పోయేవరకు నాకు రాసిన ఎన్నో ఉత్తరాలు....నన్నుఇప్పటికీ ఆయన వడిలో పడుకోపెడతాయి అంటే మీరు నమ్మకపోవచ్చు....
ఆ కోర్సుకు వెళ్ళే బదులు, మీకు గిట్టని వాళ్లకి, మీకు నచ్చిన వాళ్ళకి, ఓ చక్కని విషయం గురించి వివరిస్తూ ఉత్తరాలు రాయండి. కమ్యూనికేషన్ లో మీకు మించిన వారు ఇక ఉండకపోవచ్చు"
ఎవరయినా కమ్యూనికేషన్ కోర్సు చేయాలనుకుంటే, నేను వాళ్ళ కిచ్చే సలహా ఒక్కటే.....
అంటూ ముగించారు ప్రఖ్యాత counselor , ప్రముఖ All India Radio వ్యాఖ్యత శ్రీమతి వీరవెంకట వరలక్ష్మీ గారు.
జైకిషన్ శింగరాజు




Super.
ReplyDeleteఅద్భుతం. మా చిన్నప్పుడు(అంటే ఓ యాబై ఏళ్ళ క్రితం) విశాలాంద్రలో పరుసురామయ్య పంతులుగారు అనే ఓ పెద్దాయన రచనలు చేసేవారు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఏదో విషయం చేబుతునట్టుగా చెబుతూ అసలు విషయం చెప్పడం. అప్పట్లో ఆయన రచనలు కోసం ఎదురుచూసేవాళ్ళం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మళ్ళా ఇన్నేళ్ళకి మీ బ్లాగ్లో సరిగ్గా ఆయన రచనలని చదవగలుగుతున్నాను. మీరు చెప్పేతీరు , ఆ ఆవేశం , వేదన , తపన , వాటిని వ్యక్తపరిచే తీరు పరమాద్భుతం. వాటిని చదువుతూ మౌనంగా ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాను , ఎదురుచూస్తున్నాను. మీ వయసుకి నా దీవెనలు మనసుకి నా వందనములు. Y.V.K.Rao. Rajolu, AP.
ReplyDelete