జలపాతం

జలపాతం
ఆకలి వేసి ఏడుస్తున్న, బిడ్డని చూసిన తల్లిని ఆపడం....రామ నామ జపం చేస్తున్న చోటుకి వెళ్ళకుండా హనుమయ్యని ఆపడం.....మనిషిలోని 'ఆ మనిషిని' తట్టిలేపుటకు జాలువారిన ఈ " జలపాతం " జోరును ఆపడం.....బహుశా ఎవరికీ సాధ్యం కాదు - జైకిషన్ శింగరాజు

Thursday, 16 June 2011

గ్లామర్ బాబు గ్లామర్...



" అక్కా..... అక్కా.....
 చిన్నీ....ఓయ్ చిన్నీ....చిన్నీ తల్లీ...అయ్యో ఏమిటీ ఎవ్వరు పలకరు....  ఇల్లంతా చీకటిగా ఉంది......ఎవ్వరూ లేరా..."

" లేకనేరా తమ్ముడు....ఇక్కడే ఉన్నాం అంతా....."

" అబ్బా...తూ ... హడిలిచచ్చాను.....అయినా ఇదేమిటక్కా చీకట్లో కూర్చున్నావ్ ...."

" ఇంకా ఏముంది కాబట్టి వెలుగులోకి రమ్మంటావ్ రా .....అంతా అయిపోయింది....." 

" ఏమయిందక్కా సడన్ గా నీకు ఇంత వైరాగ్యం.... అందరూ కులాసాఏనా  ?....."

" ఏం మాయరోగంరా మాకు .....దుక్కల్లా ఉన్నాం...."

" మరెందుకక్కా బాదపడుతున్నావ్....."

" బాదపడక..... జరుగుతుంది చూసి నవ్వుకోమంటావా...."

" అసలేం జరిగిందక్కా..... నాకేం అర్ధం కావడంలేదు  ....కాస్త వివరంగా చెప్పవూ "

" నాకు మటుకూ అర్ధమయింది గనకనా.....కంచిపట్టు చీర కట్టుకుని దాని పక్కన నుంచుంటే...టీవీలలో పేపర్లలో నన్ను చూసి.....అదిగో పావని వాళ్ళమ్మ....ఇదొగో పావని వాళ్ళమ్మ అంటూ జనాలు నన్ను గుర్తు పట్టడం .....ఎక్కడకి వెళ్ళినా జనాలు గుమిగూడడం....ఇలా ఎన్ని కలలు    కన్నానో.... ఛ ఛ అంతా అయిపోయింది.... "

" ఒక్క కంచిపట్టు ఏమిటి....బెనారస్ బెంగళూరు పోచంపల్లి పుట్టపాక్షి .....ఇలా ఏది కట్టినా నిన్ను పావని వాళ్ళ అమ్మనే అంటారు...."

" ఇంకిప్పుడెoదుకంటారు.....అంతాయిపోయింది "     

" అబ్బబ్బా నాకు పిచ్చెక్కుతోంది అక్కా .....చిన్నీ..... చిన్నీ ....."

" ఏంటి మామయ్యా....."

" ఓ నువ్వూ ఇక్కడే ఉన్నావ్.....అసలేమయిందే బాబూ .....మీ అమ్మ అలా మాట్లాడుతుందేమిటి ..... నా తల్లి కదూ....నువ్వైనా కాస్త వివరంగా చెప్పవే పావని ! "

" నన్నేమి అడక్కు మామయ్యా నాకేమి తెలియదు....అంతా అయిపోయింది...."

" అంతా అయిపోయిందని మటుకు తెలుసు....ఓరి భగవంతుడా ఎరక్కపోయి ఈవేళ వీళ్ళ ఇంటికి వచ్చినట్టున్నాను  ....ఇంతకీ ఏడి.... మా బావేడీ ?...." 

" ఇందాకడినుండి నువ్వు కూర్చుంది వాడి కాలు మీదే... నీపక్కనే ఉన్నాను ...."

" హయి...నూతిలో దొరుకుతున్నపాతసామానులాగ అంతా ఇక్కడే దొరుకుతున్నారన్నమాట..... 
 సరేగాని బావా.... ప్రేతాత్మల్లాగా ఈ చీకట్లో మీటింగూ....ఏడుపులూ నిట్టూర్పులు....అసలేమయింది ?"

" ఇంకా ఏమి అవలేదు....ఏదో అవ్వకూడదనే ఈ నిర్ణయం "

" ఏ నిర్ణయం బావా "     

" చిన్నీ ఇక నుండి బ్యాడ్మింటన్ ఆడకూడదని నిర్ణయం"             

" ఏమిటీ.... స్టేట్ చాంపియన్ మన పావని ఇక ఆడకూదదా ? ఏమిటి బావా నువ్వు మాట్లాడుతోంది "

" అదీ... అలా అడగరా తమ్ముడూ...అడిగి అడిగి సమాధానం దొరక్క ఏడుస్తున్నాం ఇందాకడినుండి " 

"ఒరేయ్...మాది నిప్పులు కడిగిన వంశంరా....ఇంతజరిగినా అది బ్యాడ్మింటన్ ఆడుతోంది అంటే మమ్మల్ని కుటుంబం నుండి వేలేస్తారు..... ఇక జన్మలో దానికి పెళ్లవ్వదు "

" బావా బ్యాడ్మింటన్ కి - వెలేయడానికి ..... మళ్లీ దాని పెళ్ళికి....అస్సలు సంబంధం ఏమిటీ....? " 

" నువ్వు మీ అక్కా రోజూ కనీసం పేపర్ అయినా చదివేడుస్తే నా బాధ మీకు అర్ధమయ్యేది "

" ఇంతకీ విషయం ఏమిటి బావా ? "

" బ్యాడ్మింటన్ ఆటకు అనుకున్నంత ప్రజాదరణ లేదనీ....ఆదరణ పెరగాలంటే ఆడ ప్లేయర్లంతా నిక్కెర్లకు,గౌన్లకు బదులుగా పొట్టి స్కర్ట్లను మాత్రమే వేసుకోవాలని...అలా వేసుకోని యెడల వారు ఆడుటకు అర్హులు కారని, ఏప్రిల్ 15 2011 నాడు బ్యాడ్మింటన్ సమాఖ్య తమ నిర్ణయాన్ని వెల్లడించింది "

" అదేమిటి బావా... ఆటలోని నైపుణ్యాన్ని బట్టి ఆదరణ గాని...పొట్టి గౌన్లు వేస్తే ఎగబడతారా....ఒక వేళ అలా ఎగబడినా, ఆటకు ఆదరణ పెరిగినట్టెలా అవుతుంది ? "

"నిర్ణయించే వాడి ఆలోచన అలా తగలడితే మనం మటుకు ఏమి చెయ్యగలం రా....మనదేశంలో క్రికెట్ కి అంత ఆదరణ ఉండి కూడా, చీర్ గాళ్స్ బీభత్సాలు చూడడంలా  ....ఇదీ అంతే. 
ఆడవాళ్ళు అలా కనపడితే గాని, కనీసం ఆటని కూడా చూడలేని బుద్ది తక్కువ వెదవలకి పెత్తనాలప్పచేప్తే.....నిర్ణయాలు ఇలా కాక, మరోలా ఉంటాయా చెప్పు" 

"బ్యాడ్మింటన్ ఆటలో మన భారతదేశ కీర్తిప్రతిష్టలను పెంపొందిస్తున్న మన హైదరాబాద్ అమ్మాయి, జూనియర్ ప్రపంచ చాంపియన్ సైనా నెహ్వాల్ స్వయంగా, ఈ పొట్టి స్కర్ట్ విషయంలో అభ్యంతరం చెప్పినా....కొన్ని మ్యాచ్ లు ఆడితే నీకే అలవాటవుతుంది అని ఉచిత సలహా కూడా ఇచ్చిందట సమాఖ్య "                          

"వాడి దిక్కుమాలిన ప్రజాదరణ కార్యక్రమంలో భాగంగా, ఏ మొహం పెట్టుకుని నాకూతురికి పొట్టి గౌను వేసి ఆడించ మంటావ్ చెప్పు....అందుకనే ఈ సంవత్సరం ఆ డిగ్రీ కాస్తా పూర్తయిందనిపించి, ముద్దు ముద్దుగా ఏ అయ్య చేతిలోనో పెట్టేసానంటే, నా భాధ్యత తీరిపోతుంది"       
===========================

Playing with the Shorts
Playing with Skirt

-----------------------------------------

భక్తి టీవీ చానళ్ళ న్యూస్ రీడర్ దగ్గర నుండి బ్యాడ్మింటన్ ప్లేయర్ ల దాకా అందరూ గ్లామరస్ గా ఉండాలనుకోవడం సబబు కాదు....అలా ఉంటే అది గ్లామరూ కాదు.....ఒకవేళ అదే గ్లామర్ అయితే..... గ్లామర్ అనే పదం, తప్పకుండా అందమనే మాటకి, ఇంగ్లీషు తర్జుమా కానేకాదు....వికారం అనే మాటకి నిర్వచనం అయిఉండాలి. ఇది తెలుసుకో గలిగితే.....అందమూ, ఆట, గ్లామరూ .....దాని నుండి  సమాజమూ... అన్నీ సురక్షితము.              


జైకిషన్ శింగరాజు  

1 comment:

  1. కథ చెప్పిన తీరు బాగుంది

    ReplyDelete